జనగామ రూరల్: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో రైతులు అధిక ఆదాయం పొందాలని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ఓబుల్‌కేశవాపూర్ గ్రామంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతీ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందన్నారు. ‘నాణ్యమైన విత్తనం–అధిక దిగుబడికి పునాది’ అనే లక్ష్యంతో రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యానవన పంటలను సాగు చేస్తే ఆదాయం మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీధర్‌రావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
స్మృతి వనం అభివృద్ధి పనులు
వేగవంతం చేయాలి
పాలకుర్తిలోని బమ్మెర పోతన స్కృతి వనం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. సోమవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో స్మృతి వనం సమగ్ర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బమ్మెర అభివృద్ధి పనులకు సంబంధించిన సవరించిన అంచనాలను త్వరగా ఖరారు చేసి, టెండర్ ప్రక్రియను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఇరిగేషన్ శాఖ, పర్యాటక శాఖ, ఆర్‌ఆండ్‌బీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు
విత్తన మేళా ప్రారంభంలో
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


