సరిపడా గదులు లేవు
జఫర్‌గఢ్: గదుల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేవు. మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 41 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం రెండు గదులు ఉండగా ఒక గదిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా మరొక గదిలో పాఠశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలకు ఒకే ఒక్క గది ఉండడంతో ఒకటో తరగతికి సంబంధించిన పిల్లలకు ఇదే గదిలో పాఠాలు బోధిస్తుండగా మిగతా తరగతులకు చెందిన విద్యార్థులకు గదులు లేకపోవడంతో పాఠశాల వరండాలో రెండు చోట్ల వేర్వేరుగా పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుత వర్షాకాలంలో కొద్దిపాటి చినుకులు పడితే పిల్లలందరూ ఒకే గదిలో కూర్చోవాల్సి వస్తుంది. పాఠశాలలో సరిపడా గదులు లేక పిల్లలందరికీ ఒకే చోట పాఠాలు చేప్తున్నారనే కారణంతో కొంత మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. పాఠశాలకు అదనపు గదులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా పాఠశాలలో అదనపు గదులు నిర్మించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.
పాఠశాలలో ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో పాఠశాల మరొక గదిలో అంగన్‌వాడీ నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల వరండాలోనే పిల్లలకు వేర్వేరుగా పాఠాలు చెబుతున్నారు. విద్యాబోధనకు ఇబ్బందికరంగా మారింది. గదుల కొరత విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– పులి సమ్మయ్య, సర్పంచ్, తిమ్మాపూర్
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు


