జనగామ: జిల్లా కేంద్రంలోని విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో గుట్కాలు, పాన్ మసాలాలు, సిగరెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో సోమవారం నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. నార్కొటిక్ డ్రగ్స్ ఎస్సై సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు రమేష్, సుధాకర్, సివిల్ కానిస్టేబుళ్లు శ్రీకాంత్, శ్యామ్‌తో కూడిన బృందం ప్రత్యేక పోలీసు జాగిలంతో కలిసి విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న పాన్ షాపులు, కిరాణ దుకాణాలు, జనరల్ స్టోర్లు, టీ స్టాళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది. పలుషాపుల్లో అంబర్, జోడబుల్‌తో పాటు ఇతర గుట్కా ఉత్పత్తులు, సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత దుకాణదారుల వివరాలను స్థానిక సివిల్ పోలీసులకు అందజేసి కేసు నమోదు చేయాలని నార్కొటిక్ బృందం ఆదేశించింది. ఈ సందర్భంగా ఎస్సై సమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న ఏ దుకాణంలోనూ పొగాగు ఉత్పత్తుల అమ్మకం విక్రయించడం చట్టవి రుద్ధమని స్పష్టం చేశారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
నార్కొటిక్, డ్రగ్స్ బృందం
మెరుపు దాడులు


