లక్ష్యం చేరుకునే విధంగా..
జనగామ: దేశంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించడం, వర్షపు నీటిని సద్వినియోగం చేయడం, నీటి వనరులను స్థిరంగా సంరక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, ఇంకుడు గుంతల వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం, ప్రతీ గ్రామంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. భూగర్భజలాల వినియోగాన్ని శాసీ్త్రయంగా పర్యవేక్షిస్తూ నీటి వృథాను నివారించే చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో దీనిని సమర్థవంతంగా అమలు చేస్తూ, నీటి వనరుల సంరక్షణ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది.
కేంద్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమంలో భూగర్భ జలాల లభ్యత ఆధారంగా బావుల తవ్వకాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సహజంగా పునరుద్ధరణ అయ్యే భూగర్భ జలాల కంటే అధికంగా నీటి వినియోగం జరుగుతున్న ప్రాంతాల్లో కొత్త బావుల తవ్వకాలకు అనుమతి లేదు. జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో 76 గ్రామపంచాయతీలు ఈ పరిధి లోకి రావడంతో అక్కడ బావుల తవ్వకాలు చేపట్టరు. బచ్చన్నపేట–13, నర్మెట–3, తరిగొప్పుల–4, జనగామ–14, లింగాలఘణపురం –4, దేవరుప్పుల–6, పాలకుర్తి–7, కొడకండ్ల–6, స్టేషన్ ఘన్‌న్‌పూర్–3, రఘునాథపల్లి–6, జఫర్‌గఢ్–4, చిల్పూర్–3 గ్రామపంచాయతీలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 104 గ్రామ పంచాయతీల్లో ఒక్కో మండలానికి ఐదు బావుల చొప్పున అనుమతి ఇవ్వగా, ఒక్కో బావికి రూ.3 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ బంజరు, అసైన్డ్ భూములకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఐదు ఎకరాల్లోపు పాస్‌బుక్, గ్రామ పంచాయతీ తీర్మాణం, సన్న, చిన్నకారు రైతు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి వీబీజీ రాంజీ(ఉపాధిహామీ) కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాలకు భౌతిక లక్ష్యాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం, జిల్లా లక్ష్యాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ఎంపీడీఓల మండల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీలకు లక్ష్యాలను వెంటనే పంపిణీ చేయడం, నిరంతర ఉపాధి కల్పన, నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించడం, సాంకేతిక, పరిపాలనా అనుమతులు పూర్తి చేయడం, ఎంఐఎస్ ద్వారా రోజు వారీ పురోగతిని డీఆర్‌డీఏ ద్వారా కలెక్టర్‌కు సమర్పించడం వంటి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 2,340 హార్టికల్చర్ ఎకరాలు, 2 వేల లబ్ధిదారులు, 7,020 ఫార్మ్ పాండ్లు, 2,340 రీఛార్జ్ పిట్లు, 585 నాడెప్, వెర్మీ యూనిట్లు, 270 ఫిష్ ట్యాంక్ పనులు, 54వేల వ్యక్తిగత సోక్‌పిట్ పనులు, 270 కమ్యూనిటీ సోక్‌పిట్లు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. మండలాల వారీ లక్ష్యాలను కచ్చితంగా అమలు చేసి గ్రామీణ ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, శాశ్వత ఆస్తుల సృష్టిలో జిల్లా నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
మండలానికి 5 బావుల తవ్వకం
ప్రభుత్వ, బంజరు భూములు, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం
76 జీపీలకు కొత్త బావులకు నో.. మిగిలిన చోట్ల గ్రీన్‌సిగ్నల్
2026–27కు మండలాల వారీగా పనుల టార్గెట్
కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల భారీ లక్ష్యాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. అధిక నీటి వినియోగం ఉన్న గ్రామపంచాయతీల్లో కొత్త బావులకు అనుమతి ఉండదు. అర్హత ఉన్న ప్రాంతాల్లో ఒక్కో మండలానికి ఐదు బావులకు అవకాశం కల్పించాం. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తాం. మండలాల వారీగా లక్ష్యాలు నిర్ధేశించుకుని పనులు చేపడుతాం.
– ఆర్.భాస్కర్, పీడీ, డీఆర్డీఓ


