హన్మకొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి నాలుగున్నర గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
నిలకడగా ఆరోగ్యం
హనుమకొండ హంటర్‌రోడ్డులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన వెంటనే పెద్ది సుదర్శన్‌రెడ్డిని భార్య స్వప్న, అందుబాటులో ఉన్న కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు చేరుకున్న వెంటనే డాక్టర్ మమత చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నాయకులకు సమాచారం అందించారు. హనుమకొండలోనే ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, అరూరి రమేశ్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, శంబీపూర్ రాజు, హైదరాబాద్ నుంచి పలువురు సీనియర్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. భార్య పెద్ది స్వప్నతో మాట్లాడి సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వారు చెప్పారు. కాగా, సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరగడంతో వైద్యులు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.
డాక్టర్‌కు అభినందనల వెల్లువ
కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ మమత కాపాడారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాపాడిన ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. గంటపాటు శ్రమించి పట్టువదలకుండా అంకితభావంతో సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రాణాలు కాపాడిన మమతకు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఎక్స్‌లో అభినందనలు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి
గుండెపోటు
తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు
భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్
నాయకులు, కార్యకర్తలు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ


