విత్తనమేళా కేంద్రాలు
పంట మార్పిడితో మంచి దిగుబడి
జనగామ రూరల్: ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేటి (సోమవారం) నుంచి 29 వరకు ఉదయం 10.00 గంటల నుంచి జిల్లాలోని ఎంపిక చేసిన రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నారు. జిల్లాలో వరి పండించడానికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
విత్తన ఎంపిక సాగు పద్ధతులు
వరి పంటకు బదులుగా సాగు చేయదగిన ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు, రాగులు తదితర పంటల నాణ్యమైన విత్తనాలు వివిధ విత్తన సంస్థలు, సహకార సంఘాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో రైతులకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రైతులకు పంటల ఎంపిక, విత్తనాల మోతాదు, సాగు యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ శాఖ అధికారులు సాంకేతిక సలహాలు అందించనున్నారు. ఏదైనా రైతు కోరుకున్న విత్తన రకం సంబంధిత రైతు వేదికలో అందుబాటులో లేకపోతే, వ్యవసాయ శాఖ ద్వారా ఇతర కేంద్రాల నుంచి ఆ విత్తనాన్ని సమకూర్చి రైతుకు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లాలోని రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకొని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
నేటి నుంచి 29వరకు రైతు వేదికల్లో విత్తన మేళాలు
రైతులకు ఆరుతడి పంటలపై
అవగాహన
సందేహాల నివృత్తికి అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు
బచ్చన్నపేట – బచ్చన్నపేట రైతు వేదిక
చిల్పూర్ – మల్కాపూర్ రైతు వేదిక
దేవరుప్పుల – దేవరుప్పుల రైతు వేదిక
స్టేషన్ ఘన్‌పూర్ – స్టేషన్ ఘన్‌పూర్ రైతు వేదిక
జనగామ – ఓబుల్‌కేశవాపూర్ రైతు వేదిక
కొడకండ్ల – ఏడునూతుల రైతు వేదిక
లింగాలఘనపురం – బండ్లగూడెం రైతు వేదిక
నర్మెట – నర్మెట రైతు వేదిక
పాలకుర్తి – పాలకుర్తి రైతు వేదిక
రఘునాథపల్లి – రఘునాథపల్లి రైతు వేదిక
జఫర్‌గఢ్ – జఫర్‌గఢ్ రైతు వేదిక
తరిగొప్పుల – తరిగొప్పుల రైతు వేదిక
సాగు పరిస్థితులు ఆర్థం చేసుకొని రైతులు తమకు ఉన్న భూమిలో నీటి లభ్యతకు సరిపోను వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలు కంది, పెసర, మినుములు, కొర్రలు వంటి పంటల సాగుపై ఆసక్తి పెంచుకోవాలి. పంట మార్పిడి వల్ల దిగుబడితో పాటు ఆర్థిక వనరులు పెరుగుతాయి. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సాగు చేయాలి. హెల్ప్‌లైన్ 1950,1800 425 6605 నంబర్లలో సంప్రదిస్తే అధికారులు తగిన సూచనలు ఇస్తారు.
– సందీప్ కుమార్ ఝా, కలెక్టర్


