అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

ప్రజల సహకారమే పోలీసులకు బలం..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక సీసీ కెమెరాల నెట్‌వర్క్‌తో పాటు నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణ కోసం గతంలో పని చేసిన పోలీస్‌ అధికారులు.. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర సంస్థల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు

గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల విక్ర యం, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని సీపీ వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రవాణ అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. మరింత పటిష్టంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.

నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు..

ప్రజల భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా సహించబోమని సీపీ శ్వేత స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే నిరోధక చర్యలను కూడా అమలు చేస్తామని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీటర్లను గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించి పోలీసు కట్టుబాట్లను సూచిస్తామని వివరించారు. సుమారు 700 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటామని, పోలీస్‌ యాక్షన్‌ త్వరలోనే చూస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా కీలక భాగస్వాములని సీపీ శ్వేత అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు, నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందిస్తే త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు.

ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

మీడియా సమావేశంలో సీపీ ఎన్‌.శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement