మున్సిపల్ కమిషనర్ మినహా అందరూ ఇన్‌చార్జులే
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీకి ప్రస్తుత కమిషనర్ రాధాకృష్ణ మినహా ప్రధాన శాఖల అధికారులు అందరూ ఇన్‌చార్జులే ఉన్నారు. రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్.. మున్సిపాలిటీగా మారి ఏడాదిన్నర గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే నెలకొని ఉన్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో 2025లో స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి జంటపట్టణాలు, ఛాగల్లు గ్రామాలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. ఇక పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీరు తదితర సమస్యలు ఉండబోవని, ఒకవేళ ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠవేయగా ఘన్‌పూర్ పేరుకే మున్సిపాలిటీ అన్నట్లుగా ఉంది.
18వార్డులకు ఒక్కరే..
మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు గాను 18 మంది వార్డు ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఒకే ఒక్క వార్డు ఆఫీసర్ ఉన్నారు. నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి మూడు, నాలుగు వార్డుల చొప్పున ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ప్రధానశాఖ అయిన టీపీఓ లేకపోవడంతో టీపీడీఓ డిప్యుటేషన్‌పై ఇక్కడ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారానికి కేవలం రెండు రోజులే వస్తుండగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపల్ ఏఈ సైతం రెగ్యులర్‌గా లేకపోవడంతో ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న అధికారి వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే వస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యను పర్యవేక్షించే శానిటరీ ఇన్‌స్పెక్టర్ సైతం లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్‌ను ఇన్‌చార్జ్‌గా ఉంచి నామమాత్రంగా నడిపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందించేలా పనిచేసే మెప్మాకు చెందిన టీఎంసీ సైతం రెగ్యులర్‌గా లేరు. ఇన్‌చార్జ్ టీఎంసీ ఉన్నారని, మెప్మాలో ఉండాల్సిన సీఓ(కమ్యూనిటీ ఆర్గనైజర్), డీఈఓ(డాటా ఎంట్రీ ఆపరేటర్) సైతం లేరు. మున్సిపాలిటీ ఆదాయాన్ని మానిటరింగ్ చేసే ఆర్‌ఓ రెగ్యులర్‌గా ఉండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. మున్సిపాలిటీలో కమిషనర్ మినహా ప్రధాన శాఖల అధికారులందరూ ఇన్‌చార్జ్‌లు కావడం, వారానికి రెండు, మూడు రోజులు వస్తుండగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ పనులపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలు అధికారులు అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోంది. ఏఅధికారి ఎప్పుడు వస్తారో తెలియని అయోమయస్థితిలో మున్సిపాలిటీ ఉంది.
ప్రతీ వార్డులో సమస్యలు
మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. రోడ్లపై మురుగునీరు పారుతుండగా దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు కాలనీలు సీసీ రోడ్లకు నోచుకోక మట్టిరోడ్లకే పరిమితమయ్యాయి. రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిౖకైనా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీకి రెగ్యులర్ అధికారులను నియమించి సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
డ్రెయినేజీలు సరిగ్గా లేక జనవాసాల మధ్య నిలిచిన మురుగునీరు
డిప్యుటేషన్‌పై విధులు.. అందుబాటులో రెండు, మూడు రోజులే
పేరుకే మున్సిపాలిటీగా స్టేషన్‌ఘన్‌పూర్
ప్రతి వార్డులోనూ సమస్యలతో ప్రజల ఇబ్బందులు


