జనగామ: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించే పవిత్ర దినంగా పరిగణించే తొలి ఏకాదశి సందర్భంగా జిల్లా అంతటా శివ, విష్ణు ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. ఏకాదశి ప్రారంభం నుంచి నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా పరిగణిస్తారు. ఈ కాలంలో భక్తులు నియమనిష్టలతో వ్రతాలు, జపాలు చేస్తారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరస్వామి, చిల్పూరు బుగులోని శ్రీ వెంకటేశ్వరస్వామి, పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, పాత బీట్ శ్రీరామలింగేశ్వర స్వామి, శ్రీ సంతోషీమాత ఆలయాలతో పాటు అనేక గ్రామీణ దేవాలయాల్లో విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణలు పూర్తి చేశారు. కాగా జనగామ పట్టణంలో కురుమ కులస్థులు సంప్రదాయ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు.
జనగామ: జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ శుక్రవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఇన్‌చార్జి ఏసీపీ భీమ్‌శర్మతో కలిసి స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ పోలీసు స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. తనిఖీలో భాగంగా కొత్తగా వచ్చిన, పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు, వాటి పరిష్కార స్థితిని సమీక్షించారు. అనంతరం జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్‌లు, వివిధ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల ఫైళ్లు, ఇతర అధికారిక రికార్డులను పరిశీలించారు. పరేడ్, లాఠీ డ్రిల్, బీట్ పోలీసింగ్, పెట్రోలింగ్, పెట్రోకార్ నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, ఆయుధాల నిర్వహణ, రిజిస్టర్లు, పోలీసింగ్ సేవల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసింగ్ సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తనిఖీలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐలు భరత్, రతీష్, చిన్నకేశవులు, నర్సయ్య, సిబ్బంది ఉన్నారు.
పంట మార్పిడిపై
అవగాహన కల్పించాలి
రఘునాథపల్లి: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాబావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టపోకుండా పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసా య అధికారి అంబికాసోని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులకు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల ప్రణాళిక, వీబీజీ రామ్ జీకార్యక్రమం అమలుపై నిర్వహించిన శిక్షణ, సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించేలా సలహాలు అందించాలని పేర్కొన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఏడీఏలు వసంత సుగుణ, అపర్ణ, అయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ దయాకర్, పలు మండలాల ఏఓలు, హెచ్‌ఓ, ఏఈఓలు, హెచ్‌ఈఓలు పాల్గొన్నారు.
వేయిస్తంభాల ఆలయంలో వరుణ జపం
హన్మకొండ కల్చరల్: దేవాదాయశాఖ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవా దాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు వేయిస్తంభాల ఆలయంలో మూ డు రోజుల పాటు నిర్వహించనున్న వరుణ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. వరుణ పూజల్లో భాగంగా మొదటి ఆలయ నాట్య మండపంలో వేద పండితులు మణికంఠశర్మ, సాయి తేజ, శ్రీవాస్తవ, అర్చకులు ప్రణవ్, కాశిలింగాచారి సకాలంలో వర్షాలు పడాలని వరుణ జపం, ఋశ్యశృంగ పారాయణం నిర్వహించారు.


