పోలీస్‌ ప్రెస్‌మీట్‌లపై పునరాలోచన..? | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ప్రెస్‌మీట్‌లపై పునరాలోచన..?

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

ప్రెస్‌మీట్‌లపై ఎందుకు చర్చ..?

సాక్షి, వరంగల్‌: ఏదైన కేసులో అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ప్రెస్‌మీట్‌లు నిర్వహించడం పోలీస్‌శాఖలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. ఇటీవలి కాలంలో ఈ విధానంపై న్యాయపరంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ముఖ్యంగా గుర్తింపు సాక్ష్యం (ఐడెంటిఫికేషన్‌ ఎవిడెన్స్‌), నిందితుల హక్కులు, నిష్పాక్షిక విచారణ వంటి అంశాలు కోర్టుల్లో తరచూ చర్చకు వస్తుండటంతో దర్యాప్తు సంస్థలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రెస్‌నోట్‌లకే పరిమితం కావాలనే చర్చ అంతర్గతంగా సాగుతోంది. కాగా, ప్రెస్‌మీట్‌ల నిర్వహణలో మార్పులపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు.

గుర్తింపు సాక్ష్యమే ప్రధాన అంశం..

హత్యలు, దోపిడీలు, చోరీలు వంటి కేసుల్లో బాధితులు లేదా ప్రత్యక్ష సాక్షులు నిందితులను గుర్తించడం కీలకమైన అంశం. ఇందుకోసం టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహిస్తారు. దీని ఉద్దేశం బాధితుడు లేదా సాక్షి, సంఘటన సమయంలో చూసిన వ్యక్తినే గుర్తిస్తున్నాడా లేదా అన్నది నిర్ధారించడం. నిందితుల ఫొటోలు, వీడియోలు ముందుగానే పత్రికలు, టెలివిజన్‌, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తే, అనంతరం జరిగే గుర్తింపు ప్రక్రియ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

పైకోర్టుల్లో వస్తున్న వాదనలు..

న్యాయవర్గాల సమాచారం ప్రకారం.. కొన్ని క్రిమి నల్‌ అప్పీళ్లు, లీవ్‌ పిటిషన్‌లలో శిక్షపడిన ఖైదీలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సాక్షులు సంఘటన స్థలంలో చూసి కాదు.. మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చిన ఫొటోలు చూసి గుర్తించారు అనే వాదనలు వినిపిస్తున్న సందర్భాలున్నాయని పేర్కొంటున్నారు. చార్జ్‌షీట్‌ దాఖలయ్యే వరకు, కోర్టు దోషిగా నిర్ధారించే వరకు ప్రతి వ్యక్తి చట్టపరంగా నిందితుడే తప్ప దోషి కాదనే సూత్రాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన వ్యక్తులను మీడియా ముందు ప్రదర్శించడంపై గతంలోనూ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

అధికారికంగా స్పష్టత లేదు..

ఈ అంశంపై పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఈ విషయమై పోలీసు కమిషనర్‌ శ్వేతను ఫోన్‌లో సంప్రదించగా ‘కిందిస్థాయిలో జరిగే చర్చలపై అధికారికంగా స్పందించడం సాధ్యం కాదు’ అని బదులిచ్చారు.

ఈ నేపథ్యంలో నిందితులను మీడియా ముందు ప్రదర్శించాల్సిన అవసరం ఎంత? కేసు వివరాలను ప్రెస్‌నోట్‌ల ద్వారా తెలియజేస్తే సరిపోదా? అనే చర్చ పోలీసు వర్గాలు, న్యాయవర్గాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజలకు సమాచారం చేరాలి. మరోవైపు దర్యాప్తు, గుర్తింపు ప్రక్రియ, నిందితుడికి లభించే న్యాయపరమైన హక్కులు కూడా పరిరక్షించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్నదే ప్రధాన చర్చగా మారింది.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రెస్‌నోట్‌లకే పరిమితం కావాలనే చర్చ

న్యాయపరమైన చిక్కులు, గుర్తింపు సాక్ష్యంపై కొనసాగుతున్న వాదనలు

టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌కు ముందే మీడియాలో నిందితుల ఫొటోలపై చర్చ

ప్రెస్‌మీట్‌ల నిర్వహణలో మార్పులపై లేని అధికారిక ఉత్తర్వులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement