లింగాలఘణపురం: ఆసరా ఫించన్లపై రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తోంది. పింఛన్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడూ ఈ విధమైన సోషల్ ఆడిట్ నిర్వహించకపోవడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల 17 నుంచి గ్రామాల్లో జరుగుతున్న వీబీజీ రామ్‌జీ పనులతో పాటు ఇంటింటికీ వెళ్లి ఆసరా పింఛన్లకు సంబంధించిన దివ్యాంగులైతే సదరం క్యాంపు సర్టిఫికెట్, ఒంటరి మహిళలైతే విడాకుల పత్రాలు లేదా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుందా.. అనే వివరాలను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా వృద్ధులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, చనిపోయినప్పటికీ పింఛన్లు వస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ నెల 28న మండల స్థాయిలో జరగనున్న సోషల్ ఆడిట్ వరకు అన్నీ గ్రామాల్లో పూర్తి చేసి నివేదిక సిద్ధం చేయనున్నారు. దీంతో తమ పింఛన్లు ఉంటాయో లేదోనని పింఛన్ దారులు ఆందోళన చెందుతున్నారు. అనర్హులు లబ్ధిపొందితే తొలగిస్తారా ఎందుకు సోషల్ ఆడిట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈ విషయంపై ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డిని వివరణ కోరగా వీబీజీ రామ్‌జీ పనులతో పాటు ఆసరా పింఛన్లపై కూడా సోషల్ ఆడిట్ జరుగుతోందని.. తొలగిస్తారా లేదా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని వివరించారు.
లబ్ధిదారుల్లో టెన్ష్‌న్.. టెన్షన్


