రీల్స్‌ టు సిల్వర్‌ స్క్రీన్‌ | - | Sakshi
Sakshi News home page

రీల్స్‌ టు సిల్వర్‌ స్క్రీన్‌

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

విదేశాల్లో రీల్స్‌తో ఫేమస్‌ అయిన పాలకుర్తి వాసి

కోలీవుడ్‌లో ‘13/13 లక్కీ నన్‌’తో హీరోగా అరంగేట్రం

త్వరలో రిలీజ్‌ కానున్న సినిమా

ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందు

ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్‌ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్‌ చేసి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ..

పాలకుర్తి టౌన్‌: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్‌లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. కోవిడ్‌ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్‌ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్‌ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్‌ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్‌ చేస్తూ చేసిన వీడియోస్‌ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్‌లో 20 వీడియోలు ఒక మిలియన్‌ (10 లక్షలు) వ్యూస్‌ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్‌, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్‌ సైతం నందు చేసిన ఒక రీల్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది.

కోలీవుడ్‌ హీరోగా..

నందు డాన్స్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్‌’ చిత్రంలో నందు లవర్‌ బాయ్‌ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తమిళనాడు, సింగపూర్‌, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్‌లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు.

సరదాగా చేసిన రీల్స్‌తో

హీరోగా అవకాశం..

కోవిడ్‌ సమయంలో సరదాగా చేసిన రీల్స్‌ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్‌లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్‌, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.

– రాపోలు నందు, సింగపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement