● సభాపతులు, మంత్రులుగా
మారిన విద్యార్థినులు
● ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్
జనగామ: బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ తదితర అంశాలపై విద్యార్థినులు మాక్ పార్లమెంట్‌లో చర్చించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ హాల్‌లో శనివారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్నేహ’ సంఘాల మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బాలికలు సభాపతులు, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు, ప్రజా ప్రతినిధుల పాత్రలు పోషించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాలని, పాఠశాలల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షిత వాతావరణం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ బాలికలు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్య వస్థ పనితీరును ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డీసీపీ రాజమహేంద్రనా యక్ మాట్లాడుతూ బాలికలు సైబర్ భద్రత, పోక్సోచట్టం, గుడ్‌టచ్, బ్యాడ్ టచ్, స్టాకింగ్ వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాక్ పార్ల మెంట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేయగా, ఉల్లాస్ కార్యక్రమం కింద ట్రైనర్లు, లెక్చరర్లకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, అధికారులు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


