న్యూస్‌రీల్
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న గృహజ్యోతి పథకం కింద జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లో 97 వేలకు పైగా కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లులు అందాయి. మే నెలలో జిల్లా వ్యాప్తంగా 1,45,127 విద్యుత్ సర్వీసులకు బిల్లులు జారీ చేయగా, అందులో 97,446 మంది లబ్ధిదారులుగా అర్హత పొందారు. వారిలో 92,399 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. దీని కోసం మే నెలలో ప్రభుత్వం రూ.3.14కోట్ల సబ్సిడీ భరించింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో లబ్ధిదారుల సంఖ్య 97,157 నుంచి 97,446కు పెరిగింది. అయితే జీరో బిల్లులు పొందిన వారి సంఖ్య 94,232 నుంచి 92,399కు స్వల్పంగా తగ్గింది. 2024 మార్చి నుంచి 2026 మే వరకు జిల్లాలో గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.70.13 కోట్ల సబ్సిడీ అందించింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి జీరో బిల్లు అందించడమే గృహజ్యోతి పథకం లక్ష్యం.
పెరిగిన వినియోగం
జిల్లా విద్యుత్ వినియోగం వేసవిలో ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కొనసాగుతుండగా, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల విద్యుత్ వినియోగం మాత్రం వేగంగా పెరుగుతోంది. జిల్లాలో గృహజ్యోతి కింద లబ్ధిదారులకు జీరో బిల్లులు అందుతుండడం పేదలకు ఊరటగా చెప్పవచ్చు. అయితే ఒక వైపు ఈ ఉపశమనం కొనసాగుతుండగా, మరో వైపు వేసవి తీవ్రతతో సాధారణ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా నమోదవుతోంది. ప్రత్యేకంగా పట్టణంలో వాణిజ్య, సేవారంగ కార్యకలాపాలు అధికం కావడంతో వినియోగం గణనీయంగా పెరిగింది. అలాగే స్టేషన్ ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలాల్లో వ్యాపార, చిన్న పారిశ్రామిక యూనిట్ల విద్యుత్ అవసరాలు అధిక స్థాయిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు నెలల వ్యవధిలో ఈ వినియోగం క్రమంగా పెరుగుతూ జిల్లాలో మొత్తం డిమాండ్‌ను మరింతగా పెంచేసింది. వేసవి ప్రభావం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ, శీతలీకరణ పరికరాల వినియోగం, చిన్నా, పెద్దా వర్క్‌షాప్‌లు తదితర రంగాల యూనిట్ల అవసరాలు కలిసి జిల్లాలో విద్యుత్ వినియోగ వృద్ధికి కారణమవుతున్నాయి.
మూడు నెలల డిమాండ్
జిల్లాలో గృహజ్యోతి మినహా మే నెలలో వాణిజ్య అవసరాల విద్యుత్ డిమాండ్ వేసవిలో భారీగా పెరిగింది. మే నెలలో జిల్లాలో మొత్తం 77,520 సర్వీసుల ద్వారా రూ.7.22 కోట్ల డిమాండ్ నమోదైంది. ఇది మార్చి నెలతో పోలిస్తే రూ.2.39 కోట్లు అధికం. ఎల్‌టీ కేటగిరీ–1, ఇతర ఎల్‌టీ కేటగిరీల విద్యుత్ వినియోగం జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలల్లో నెలవారీ డిమాండ్ రూ.4.83 కోట్ల నుంచి రూ.7.22 కోట్లకు పెరిగింది. అంటే 49.4 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా గృహజ్యోతి వర్తించని ఎల్‌టీ కేటగిరీ–1 కనెక్షన్ల డిమాండ్ రూ.1.37 కోట్ల నుంచి రూ.3.08 కోట్లకు, అంటే 124శాతం పెరిగింది. వేసవి కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
విద్యుత్ పొదుపు అందరి బాధ్యత
జిల్లాలో గృహజ్యోతి పథకం కింద మే నెలలో 97,446 మంది లబ్ధిదారులకు రూ.3.14 కోట్ల సబ్సిడీ అందించాం. వీరిలో 92,399 మందికి జీరో బిల్లులు జారీ చేశాం. వేసవి కారణంగా నాన్ గృహజ్యోతి కేటగిరీ డిమాండ్ రూ.3.08 కోట్లకు, ఇతర ఎల్‌టీ డిమాండ్ రూ.4.14 కోట్లకు పెరిగింది. 200 యూనిట్లు దాటకుండా వినియోగించుకు ని గృహజ్యోతి ప్రయోజనం పొందాలి. విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని గుర్తించాలి.
–సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్
నెల ఎల్‌టీ కేటగిరీ–1 డిమాండ్ ఎల్‌టీ–2 డిమాండ్ మొత్తం
(గృహజ్యోతి) (అదర్స్)
మార్చి 49,298 రూ.1.37కోట్లు 24,619 రూ.3.46కోట్లు రూ.4.83కోట్లు
ఏప్రిల్ 50,965 రూ.2.10కోట్లు 24,668 రూ.3.93 కోట్లు రూ.6.03కోట్లు
మే 52,779 రూ.3.08 కోట్లు 24,741 రూ.4.14 కోట్లు రూ.7.22 కోట్లు
జిల్లాలో పేద వినియోగదారులకు
ఇప్పటివరకు చేకూరిన లబ్ధి
మూడు నెలల్లో 124 శాతం పెరిగిన
అదర్ వినియోగదారుల డిమాండ్
మే నెలలో డిమాండ్ రూ.7.22కోట్లు
వేసవి నేపథ్యంలో తగ్గిన జీరో బిల్లులు


