● వల్మిడి ఆలయ భూములు అన్యాక్రాంతం
● కబ్జా కోరల్లో 44 ఎకరాలు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులే దేవుడి భూములకు ఎసరు పెట్టారు. గుడి మాన్యాన్ని, ధూపదీప నైవేద్యాలతో వచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, కొందరు రైతులు కుమ్మకై ్క ఆరగించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి..వల్మిడి గుట్టపై సీతారామచంద్రస్వామి ఆలయంలో నల్లగొండ జిల్లా చౌళ్ల రామారం గ్రామానికి చెందిన స్థానాచార్యులు పూజారిగా ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దేశ్‌ముఖ్(దొరల) వద్ద నుంచి పూజల కోసం కొంత భూమిని సేకరించారు. ఈ భూములపై వచ్చిన ఆదాయన్ని రాములవారి పూజలకు, ఇతర ఖర్చులకు వినియోగించేవారు. దేవాదాయ ధర్మారాదాయ శాఖ లెక్కల ప్రకారం సీతారామచంద్రస్వామి దేవస్థానం కింద పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాయపర్తి, పెద్దవంగర మండలాల్లో 60 ఎకరాల 01 గుంట భూమి దేవుడి పేరుమీద ఉంది.
అధికంగా ధర్మాపురంలో..
రాములోరి ఆలయానికి సంబంధించిన 60 ఎకరాల 01 గుంటల భూమిలో అధికంగా దేవరుప్పుల మండలం ధర్మాపురంలో 395, 396, 397, 398, 446, 447, 448.449 సర్వే నంబర్లలో 34ఎకరాల 34 గుంటలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రామస్థులు, రైతుల కబ్జాలో ఉంది. గతంలో ఓ కుటుంబం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో రాజన్న గుండు ఏరియాలో సర్వే నంబర్ 449లో నకిలీ ఎండోమెంట్ లెటర్‌తో కబ్జా చేసి నూతనంగా ఇల్లు నిర్మించబోయింది. సదరు వ్యక్తి వల్మిడి సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎలాంటి అభ్యంతరం లేనట్లు తెలిపే నకిలీ ఎండోమెంట్ లెటర్‌తో కబ్జా చేసేందుకు ధర్మాపురం జీపీ కార్యదర్శికి సిఫారసు పత్రం అందించారు. నకిలీ లెటర్ అని గుర్తించిన ఈఓ దేవరప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఆలయ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అదే విధంగా పెద్దవంగర మండలం పోచంపల్లిలో సర్వే నెం.131లో 2ఎకరాల 6 గంటలు, సర్వేనంబర్లు 132ఏ,123బీ,132సీలో 8 ఎకరాల 15 గుంటల భూమిని రైతులు కబ్జా చేశారు. వీటి విలువ మార్కెట్‌లో రూ.2కోట్లకు పైగా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఐదు మండలాల్లో కబ్జాకు గురైన దేవుడి భూములను స్వాధీనం చేసుకోవాలని వల్మిడి స్వామివారి భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు. పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆలయ భూములకు యేటా బహిరంగ వేలం నిర్వహిస్తే రైతుల్లో పోటీతత్వం పెరిగి కౌలు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఆలయ పాలక మండలి, రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.


