నేడు మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు మెగా జాబ్‌మేళా

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

పాలకుర్తి టౌన్‌: మండల కేంద్రంలోని హనుమాండ్ల ఝాన్సీరెడ్డి రాజేందర్‌రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌ ఫౌండర్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఝాన్సీరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర కల్యాణ మండపంలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 3వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌, ఐటీ, బీపీఓ, సేల్స్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు హాజరుకావాలనికోరారు. జాబ్‌ మేళా ఏర్పాట్లను ఝాన్సీరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ధాన్యం నిల్వలకు జూట్‌మిల్లు గోదాం పరిశీలన

లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురం– ఏనెబావి శివారు టీఎస్‌ఐఐసీ సమీపంలోని ప్రైవేట్‌ జూట్‌మిల్లు గోదాంలో ధాన్యం నిల్వలకు గురువారం సివిల్‌ సప్లై డీఎం హతీరామ్‌ పరిశీలించారు. మిల్లుల్లోని గోదాంలు అన్నీ నిండిపోవడంతో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ధాన్యం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు జూట్‌మిల్లు యజమానితో ఫోన్‌లో మాట్లాడి సదరు యజమానిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ అండాలు, ఐకేపీ నిర్వాహుకులు ఉన్నారు.

ధాన్యానికి నిప్పంటించి

రాస్తారోకో

కొడకండ్ల: నెలరోజులు దాటినా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాయాల్సి వస్తుండడం, ధాన్యం కాంటాలు కాకపోవడం, కాంటా అయినా ధాన్యం ఎగుమతిలో జాప్యంపై రైతులు ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రంగాపురం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. తాము గోస పడుతున్నా అధికారులు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎండిన ధాన్యాన్ని తూర్పార పట్టినా కూడా మిల్లు వద్ద కిలో, రెండు కిలోల తరుగు తీస్తున్నారని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వల్లూరి సైదులు, దుబ్బాక భాస్కర్‌రెడ్డి, భిక్షపతి, ఈశ్వర్‌, రైతులు పాల్గొన్నారు.

ఎగిసిపడిన మంటలు

జనగామ రూరల్‌: పట్టణంలోని సూర్యాపేట రోడ్డుకు కోటిరత్న హాస్పిటల్‌ వెనక వైపు ఎన్నారై పగిటిపాటి దేవయ్యకు చెందిన సుమారు మూడున్నర ఎకరాల భూమిలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారు భయాందోళన చెందారు. మంటలు వారి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం కనపడడంతో బోర్లను ఆన్‌ చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. ఆలేరు నుంచి ఫైరింజన్‌ వచ్చి మంటలు అదుపు చేసింది. తరువాత మళ్లీ కొద్దిసేపటికి మంటలు రావడంతో స్థానిక ప్రజలు మూడో వార్డు కౌన్సిలర్‌ జ్యోతి గోపికి సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, సీఐ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డిలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించిన వెంటనే ఫైరింజన్‌ను మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement