కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హన్మకొండ అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్‌ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, యాసంగి సీజన్‌కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వర్షాలు కురిసేలోగా కొనుగోళ్లు, లిఫ్టింగ్‌, నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి టీం వర్క్‌తో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓలు, సివిల్‌ సప్లై, రవాణా, పోలీస్‌ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల మధ్య గోదాంల కేటాయింపులో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

కొనుగోలు, రవాణా 80 శాతం పూర్తి..

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జనగామ జిల్లా పరిధి పలు మండలాల్లో ధాన్యం లిఫ్టింగ్‌ ఆలస్యంగా జరుగుతోందని, రవా ణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు, రవాణా ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ లారీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గన్నీ సంచుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం సేకరణ 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 97 శాతం ధాన్యం షిఫ్టింగ్‌ పూర్తయ్యిందన్నారు. జనగామ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ములుగు కలెక్టర్‌ హేమంత్‌ బొర్ఖడే సహదేవ్‌ రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశానికి రాష్ట్ర ఫైనాన్స్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ‘కుడా’ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష

హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు

Advertisement
 
Advertisement
Advertisement