జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ఇలా
కొత్త ఆర్థిక సంవత్సరానికి టార్గెట్ ..
స్థిరమైన ఆదాయం వచ్చే పంట వైపు రైతుల మొగ్గు
జనగామ: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు వేగంగా విస్తరిస్తోంది. నూనెలకు భారీ డిమాండ్ ఉండడం, పంటకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కంపెనీల ద్వారా బై బ్యాక్ హామీలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీనివల్ల సాధారణ పంటల కంటే దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే ఆయిల్‌పామ్ సాగు వైపు రైతుల మొగ్గు గణనీయంగా పెరుగుతోంది.
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు మొదటగా 2021–22 సంవత్సరంలో 73 మంది రైతులు 425.36 ఎకరాల్లో ప్రారంభించారు. అయితే సరైన మార్గదర్శకాలు, సబ్సిడీలు, అవగాహన కార్యక్రమాల వల్ల ప్రతీ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. 2025–26 నాటికి మొత్తం 2.310 మంది రైతులు 8,333.10 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు నమోదైంది.
2026–27 కొత్త ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ఎంత విస్తరించాలన్న దానిపై ప్రస్తుతం హర్టికల్చర్ అధికారులు పరిశీలిస్తున్నారు. భూభాగం, నీటి వనరులు, రైతుల ఆసక్తి ఆధారంగా త్వరలోనే జిల్లాకు ప్రత్యేక లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇప్పటికే గ్రామాల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆయిల్ పామ్ సాగు విధానం, నీటి వసతి, సబ్సిడీల వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 135 మంది రైతుల క్షేత్రాల్లో సాగుచేసిన 1,368 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు దిగుబడి ఇవ్వడం ప్రారంభించాయి. సరైన నిర్వహణ ఉంటే ఆయిల్‌పామ్ తోటలు 15–30 సంవత్సరాల పాటు నిరంతరంగా ఫలాలు ఇస్తాయి. ఒక ఎకరాలో సాధారణంగా 55 నుంచి 60 ఆయిల్‌పామ్ మొక్కలు నాటుతారు. మొక్కలు పెద్దగా పెరిగే కారణంగా విస్తారమైన ప్రదేశం అవసరం. నీటి వసతిలో డ్రిప్ కీలక పాత్ర పోషిస్తుంది. వారం రోజులకోసారి తగినంత నీరు అందించాల్సి ఉంటుంది. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పంట మంచి ఫలితాలు ఇస్తుంది. రైతులకు ప్రభుత్వ డ్రిప్ ద్వారా సబ్సిడీ అందిస్తోంది. దిగుబడి 3వ ఏడాదిలో మొదటి ఫలాలు రానుండగా, 5వ సంవత్సరం నుంచే పూర్తి స్థాయి దిగుబడి మొదలవుతుంది. ఆ తర్వాత 15–30 సంవత్సరాలు వరకూ స్థిరమైన దిగుబడి సాధిస్తారు. ప్రతీ మొక్క నుంచి ఏడాదికి 80 నుంచి 120 కిలోల వరకు ఫలాలు వస్తాయి. రైతులు నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తే దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
ఆయిల్‌పామ్ పంటకు మార్కెటింగ్ సమస్య ఉండదు. ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటుండడంతో అమ్మకం సమయంలో ఇబ్బందులు ఉండవు. సంవత్సరానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం (ఎకరాకు సగటుగా) వస్తుంది. స్థిరమైన ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ మానవ వనరుల అవసరం. దీర్ఘకాలిక దిగుబడి లాంటి అంశాలు రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ఆకర్షిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో జిల్లాలో ఈ పంట విస్తీర్ణం మరింత పెరగనుందని హార్టికల్చర్ శాఖ భావిస్తోంది.
సాగుకు కేంద్రబిందువుగా
మారుతున్న జిల్లా
2021 నుంచి 2026 వరకు
రికార్డు స్థాయిలో పెరుగుదల
135 మంది రైతుల క్షేత్రాల్లో దిగుబడి ప్రారంభం
రైతులకు అవగాహన కల్పిస్తున్న
హార్టికల్చర్ శాఖ
ఏడాది రైతులు ఎకరాల్లో సాగు
2021–22 73 425.36
2022–23 915 3,203.71
2023–24 713 2.160.70
2024–25 384 1,713.33
2025–26 225 770.00
మొత్తం 2,310 8,333.10
జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్‌పామ్ సాగు టార్గెట్ ఎంత అనే సమాచారం త్వరలోనే వస్తుంది. జిల్లాలో ప్రస్తుతం 8,333 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండగా, 135 మంది రైతుల క్షేత్రాల్లో 1,368 ఎకరాల్లో దిగుబడి మొదలైంది. రైతులు దీర్ఘకాలిక భవిష్యత్‌ను ఆలోచించి ఆయిల్‌పామ్ సాగు వైపు రావాలి.
– డాక్టర్ జె.రవికాంత్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్


