జనగామ జిల్లా: ‘అవసరమే ఆవిష్కరణకు మూలం’ అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. డీజిల్‌తో పని చేసే ప్రత్యేక స్టవ్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫాస్ట్‌ఫుడ్ హోటల్ నడపుతున్న గుండు వసంత్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందాడు.
దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.1,300 ఖర్చుతో, రెండు రోజులపాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొంచాడు. ఈ వినూత్న పొయ్యిలో విద్యుత్‌తో నడిచే బ్లోయర్‌ను అమర్చారు. ఆ బ్లోయర్ మోటార్ ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా అమర్చాడు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా బ్లోయర్‌లో రెగ్యులేటర్ కూడా అమర్చారు.
సాధారణ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు కూడా సగానికి పైగా తగ్గుతుందని వసంత్ చెబుతున్నారు. లీటర్ డీజిల్‌తో గంట నుంచి రెండు గంటలపాటు నిరంతరంగా పోయి మండుతుందని ఆయన తెలిపారు. వసంత్ ఆవిష్కరణను చూసిన మరి కొందరు హోటల్ నిర్వాహకులు తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ ఆవిష్కరణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గ్యాస్ కొరతను అధిగవిుంచాను..
పొరుగు దేశాల్లో యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకులతోపాటు ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. ఖర్చులు పెరుగుతుండడంతో కొత్త మార్గం కోసం ఆలోచించాను. అప్పడు డీజిల్‌తో పని చేసే పొయ్యి తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తక్కువ ఖర్చుతో రెండు రోజుల్లోనే తయారు చేసాను. లీటర్ డీజిల్ సాయంతో సుమారు రెండు గంటలపాటు పొయ్యి మండుతుంది. ఇప్పుడు ఖర్చు తగ్గింది. పని సులభమైంది.
– గుండు, వసంత్,ఫాస్ట్‌ఫుడ్ హోటల్ నిర్వాహకుడు


