జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వచ్చిన తర్వాత ప్రజావాణికి అర్జీలు పోటెత్తుతున్నాయి. ఫిబ్రవరి 26న జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పనితీరుపై జిల్లా ప్రజల్లో విశేష విశ్వాసాన్ని పెంచింది. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌కు గతంలో 60 నుంచి 80 వినతులు మాత్రమే వచ్చేవి. ఎప్పుడో ఒకప్పుడు 100 దాటేది. అయితే కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత గ్రీవెన్స్‌కు 200 నుంచి 250కి పైగా వినతులు రావడం జిల్లా చరిత్రలోనే రికార్డు. ప్రజలు కలెక్టర్‌ను కలిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో తరలివస్తున్నారు. వినతులు విన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వడం, సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లే వేగం పాటిస్తున్నారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి..
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. పాఠశాలల్లోకి వెళ్లి బ్లాక్ బోర్డు మీద చాక్ తీసుకొని స్వయంగా పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ధైర్యాన్ని పెంచుతున్నారు. వైద్య రంగంలో ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేస్తున్నారు. సమయపాలన, విధుల్లో అంకితభావం తప్పనిసరి అని తన తనిఖీల ద్వారా బలంగా తెలియజేస్తున్నారు. ఈ రెండు శాఖలతో పాటు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీలు, రోడ్లు, భవనాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్యశాఖ ఇలా ప్రతీశాఖపై ఫోకస్ సారిస్తున్నారు. ఏదో చూశాములే అనుకోకుండా ఆయా శాఖలకు సంబంధించి ప్రతీ ఫైల్‌ను క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దీంతో ఆ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల్లో అంకితభావం పెరగడంతో పాటు చిన్న పొరపాటు కూడా జరగకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు.
తనిఖీలకు కొత్త నిర్వచనం
ఎక్కడికి ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియకుండా అత్యంత గోప్యంగా పనితీరును నిర్వహిస్తూ శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం, అనుమతుల విషయంలో పారదర్శకతను పాటించడం ఆయన పరిపాలనా బలం. జిల్లా శాఖలు ఇప్పుడంతా అలర్ట్ మోడ్‌లోకి వెళ్లాయి. ఎప్పుడైనా కలెక్టర్ వస్తారనే భయం కాదు...వస్తే చెప్పాల్సిందే అన్న బాధ్యత భావం పెరిగింది.
సాధారణ ప్రజలకు అందుబాటులో
ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధి వరకు ఎవరికైనా ఒకే రీతిగా సమయం కేటాయిస్తున్నారు. ప్రజలు చెప్పే ప్రతి చిన్న సమస్యను సైతం ఓర్పుతో విని, వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
అనతికాలంలోనే తనదైన ముద్ర
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కేవలం కొద్ది రోజుల్లోనే సందీప్ కుమార్ ఝా పరిపాలన జిల్లా ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంకితభావం, అందుబాటు, వేగవంతమైన స్పందన, పారదర్శక పరిపాలన ఈ నాలుగు మూలాలతో సందీప్‌కుమార్ ఝా తనదైన శైలిలో జిల్లా పరిపాలనను మరింత బలోపేతం చేస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం, చేసిన ప్రతీ తనిఖీ ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచుతోంది.
286 దరఖాస్తులు..
జనగామ రూరల్: పలు సమస్యలతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ సమస్యల గురించి తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అత్యధికంగా (286) దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. అదనపు కలెక్టర్ బెన్ షోలోమ్ , ఆర్డీఓ వెంకన్న, డీఆర్‌డీఓ వసంత, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
పట్టణంలోని గిర్నిగడ్డకు చెందిన దైద స్వప్న నిరుపేదరాలినని, భర్త మరణించగా గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకుంది.
లింగాల ఘణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామ రైతులు పీఏసీఎస్ ద్వారానే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన గీత పోచమ్మ తన భర్త మృతి చెందగా పెద్ద కుమారుడు చూసుకుంటున్నాడని, చిన్న కొడుకు చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఎకరం పొలం అతడే సాగు చేసుకుంటున్నాడని, న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించింది.
పట్టణానికి చెందిన కన్నారపు ఉపేందర్ పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నానని, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించాలని వేడుకున్నాడు.
కలెక్టరేట్ ప్రజావాణికి పోటెత్తుతున్న అర్జీలు
కలెక్టర్ వద్దకు వస్తే పరిష్కారం
ఖాయమన్న నమ్మకం
ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందీప్‌కుమార్ ఝా
ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌లోనే


