పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరు | - | Sakshi
Sakshi News home page

పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరు

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్‌, కుమార్తె పావని ఉన్నారు. చరణ్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్‌ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్‌స్కూల్‌ సెంటర్‌లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్‌ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్‌ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్‌ను పలువురు ఓదార్చారు.

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

నర్మెట: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి సైతం బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్‌ రెడ్డి ప్రేమించుకుని ఏడాదికాలంగా హైదరాబాద్‌లో నివాసముంటూ మూడు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులు దూరంగా ఉండాలని, అనంతరం పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సూచించడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో గత నెల 28న రాకేష్‌ రెడ్డి (25) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. దీంతో యువతిని తల్లిదండ్రులు నర్మెటలోని అమ్మమ్మ కొన్నె లక్ష్మి వద్ద వదిలి వెళ్లారు. కాగా, అప్పటికే ప్రియుడు మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న యువతి గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నగేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement