● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు
● ఇద్దరు అన్నదమ్ముళ్ల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
● మృతులు, క్షతగాత్రులది తరిగొప్పుల మండలం
నర్సాపూర్ గ్రామం
ధర్మసాగర్/జనగామ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ముళ్లు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల రాజయ్య, రాజవ్వలకు ముగ్గురు కుమారులు. వీరిలో లోకేష్(26) వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య ఐదు నెలల గర్భవతి, మరో కుమారుడు అశోక్ (24). ఇతడు యశ్వంతపూర్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తికి ఓ దావత్ కార్యక్రమానికి బంధువులకు చెందిన కారులో వెళ్లారు. తిరిగి నర్సాపూర్‌కు వస్తున్న క్రమంలో ముప్పారం శివారులోకి రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనగా లోకేష్, అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా ఇరుకుల ప్రశాంత్, అజయ్, వినయ్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుకుల వెంకటేష్, నవీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్‌రావు తెలిపారు.


