ఫైల్‌..ఆన్‌లైన్‌! | - | Sakshi
Sakshi News home page

ఫైల్‌..ఆన్‌లైన్‌!

Mar 21 2026 6:03 AM | Updated on Mar 21 2026 6:03 AM

జనగామ: జిల్లా పరిపాలనలో నూతన సాంకేతికతకు నాంది పలుకుతూ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఈ–ఆఫీస్‌ సేవలు ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డిజిటల్‌ వ్యవస్థ, ఫైళ్ల ప్రాసెసింగ్‌ను పూర్తిగా మార్చివేయనున్నారు.

పరిపాలనలో వేగం

జిల్లాలో పేపర్‌ ఆధారిత ఫైల్‌ వ్యవస్థను క్రమంగా పూర్తిగా తొలగించి, పారదర్శకతను పెంచే దిశగా ఈ–ఆఫీస్‌ కీలకంగా పనిచేస్తుంది. ఆన్‌లైన్‌ ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ వల్ల ఒక ఫైల్‌ ఎక్కడ ఉంది.. ఎంతసేపు పెండింగ్‌లో ఉంది.. ఏ దశలో ఉందన్నది సమయానుకూలంగా చూసుకునే వీలు కలుగుతుంది. దీనివల్ల సేవల వేగం గణనీయంగా పెరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి జాప్యానికి చెక్‌ పడుతుంది. అన్ని శాఖల్లో ఇదే తరహా డిజిటల్‌ వర్క్‌ వ్యవస్థను అమలు చేసే విధంగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఫైల్‌ ప్రాసెసింగ్‌లో విప్లవాత్మక మార్పు

ఈ–ఆఫీస్‌ ద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య ఫైళ్ల తరలింపు పూర్తిగా డిజిటల్‌ అవుతుంది. ఫైళ్లను భౌతికంగా ఒక శాఖ నుంచి మరో శాఖకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అలాగే ఫైల్‌ స్థితిపై పూర్తి స్పష్టత రానుండగా, విభాగాల మధ్య సమన్వయం, వేగవంతం, అధికారుల పనితీరుపై పర్యవేక్షణ సులభతరమవుతుంది. అనవసర ఆలస్యం కాకుండా నిరంతరం కలెక్టర్‌ పర్యవేక్షణ చేసేందుకు ఈ –ఆఫీసు సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

సిబ్బందికి డిజిటల్‌ నైపుణ్యంపై శిక్షణ

ఈ–ఆఫీస్‌ అన్నది కేవలం సాఫ్ట్‌వేర్‌ మాత్రమే కాదు.. ఇది ఒక నూతన పరిపాలనా సంస్కృతి. ప్రతీ అధికారి, సిబ్బంది దీనిపై పూర్తి అవగాహనతో ముందుకు రావాల్సి ఉంటుంది. అందుకోసం శిక్షణా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేలా కలెక్టర్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి శాఖ 100 శాతం డిజిటల్‌గా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

పౌర సేవలపై ప్రత్యక్ష ప్రభావం

ఈ సేవల ద్వారా రెవెన్యూ, భూమి, ధ్రువపత్రాలు, అనుమతులు వంటి సేవలు వేగవంతమవుతాయి. ఫైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌తో ఫిర్యాదులు తగ్గనుండగా, నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం పెరుగుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వానికి పేపర్‌, ఇతర మెటీరియల్‌ ఖర్చుల ఆదా అవుతాయి. ఏ ఫైల్‌కై నా యూనిక్‌ ఐడీ ద్వారా ట్రాకింగ్‌ సౌకర్యం ఉంటుంది.

జిల్లాలో ఈ–ఆఫీసు సేవలకు కలెక్టర్‌ శ్రీకారం

పేపర్‌లెస్‌ పరిపాలన దిశగా కీలక అడుగు

సేవలు వేగవంతం..పారదర్శకత పెంపు లక్ష్యం

రెవెన్యూ, భూ సేవల్లో వేగవంతమైన పరిష్కారం

ప్రజా సేవల్లో ఆలస్యానికి అడ్డుకట్ట

ఈ –ఆఫీసుపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

ప్రతీ శాఖలో అమలు చేయాలి

ఈ–ఆఫీస్‌ సేవలను జిల్లాలో ప్రతీ శాఖ అనుసరించాలి. పేపర్‌లెస్‌, వేగవంతమైన, ప్రజాపరిపాలన అందించాలనేదే మా లక్ష్యం. పనితీరులో జవాబుదారీతనాన్ని పెంచే విధంగా ఈ–ఆఫీసు సేవలు ఉంటాయి. ఫైళ్ల ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతీ శాఖలో ఈ విధానం అమలు చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈ–ఆఫీసు సేవలపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల నిల్వ, ట్రాకింగ్‌ సులభతరమవుతుంది. జిల్లా పరిపాలనలో ఆధునికతకు నాంది పలికాం. ప్రతీ ఫైల్‌ ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ అవుతుంది. ఏ ఫైల్‌ ఎక్కడ ఉందో క్షణాల్లో తెలుసుకునే వీలు ఉంటుంది. శాఖల మధ్య సమన్వయంతో పాటు సమయం ఆదా అవుతుంది.

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement