జనగామ: ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ పండుగ నేపథ్యంలో జిల్లాలో మజీద్, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేశారు. నేడు(శనివారం) రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మజీదులు, ఈద్గాలు విద్యుదీపాలతో అలంకరించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
హోటళ్లలో డొమెస్టిక్
సిలిండర్లు వాడొద్దు
స్టేషన్‌ఘన్‌పూర్: హోటళ్లు, దాబాలు, మెస్‌లలో ఎలాంటి డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ హోటళ్లు, మెస్‌లు, దాబాలకు సంబంధించిన వ్యాపారులు, యజమానులకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ వేణు మాట్లాడారు.. ప్రస్తుతం గ్యాస్ కొరత ఉన్న కారణంగా హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవన్నారు. కాగా, వ్యాపార నిమిత్తం వంటగ్యాస్ సిలిండర్లను సకాలంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్నకు హోటళ్ల నిర్వాహకులు వినతిపత్రం అందించారు.
23 నుంచి
మక్కల కొనుగోళ్లు
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మార్కెట్‌లో ఈనెల 23న మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ డీఎం ఎడ్ల రంజిత్‌రెడ్డి, ఏంఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి తెలిపారు. మక్కల కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇటీవల అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తావించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్ డీఎం రంజిత్‌రెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్‌తో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కుమారస్వామి, సంతోష్ పాల్గొన్నారు.


