దిగితే కాని తెలవట్లే!
● ప్రచారానికి తక్కువ టైం..
అయినా పెరుగుతున్న ఖర్చు
● నేటి ఉపసంహరణతో పోటీపై స్పష్టత
● ప్రచారంలో పల్లా,
కడియం దూకుడు
జనగామ: పురపాలిక ఎన్నికల్లో అభ్యర్థులకు ఫీల్డ్‌లోకి దిగిన తర్వాతే అసలు పరీక్ష ఎదురవుతోంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఖర్చు తగ్గుతుందని ముందుగా భావించారు. ఇంటింటా ప్రచారం, కేడర్‌తో సమన్వయం, సమావేశాలు, ర్యాలీలు..రాత్రి సమయంలో విందులతో ఖర్చుతో పాటు ఒత్తిడి అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రెండు పురపాలికల్లో ఎన్నికల వేడి రగులుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో ఖర్చు భారీగానే పెట్టాల్సి వస్తుందని అభ్యర్థులు వణికిపోతున్నారు.
హోరాహోరీ..
జనగామ, స్టేషన్‌న్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రోజుకి ఐదు వార్డుల్లో ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కష్టపడుతున్నారు. ఇదే వేగంతో స్టేషన్‌న్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేడర్‌కు దిశానిర్దేశం చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక జనగామలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగానే కనిపిస్తోంది. పలు వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవడంతో ప్రచారం ఇంకా పూర్తిగా పట్టాలు ఎక్కలేదు. అధికార పార్టీ, బీజేపీ, ఇతర అభ్యర్థులు ప్రచారం మొదలెట్టిన వేళ అభ్యర్థుల ఖరారులో జాప్యం కాంగ్రెస్ ప్రచారానికి ఇంకా దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ పలు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు.
నేడు ఉపసంహరణ
ఇంతలో నామినేషన్ల ఉపసంహరణ దశకు చేరుకోవడంతో పార్టీల దృష్టి ఆ వైపు మళ్లింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల బీఫామ్‌లను ఎన్నికల అధికారులు వద్ద సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే సమయానికి పార్టీల బీఫామ్‌ల అందజేత ప్రక్రియ కూడా ముగియనుంది. ఉపసంహరణ కోసం ఎన్నికల కమిషన్ జనగామ మున్సిపల్, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్లలో నామినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉపసం హరణతో తుది జాబితా ఖరారుకానుండడంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరిని నిలబెట్టాలి.. ఎవరిని ఉపసంహరించాలి.. ఏ వార్డులో అధికార పార్టీ, ఏ వార్డులో రెబల్స్ ప్రభావం అన్నదానిపై పార్టీ నాయకులు గంట గంటకు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్ర చారం మరింత వేడెక్కుతుండడంతో వచ్చే రెండు రోజులపాటు జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం ఉండే అవకాశం ఉంది.


