మున్సి‘పోల్స్’ను సమర్థవంతంగా నిర్వహించాలి
● అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచన
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్‌ను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు.
పక్కా ప్రణాళికతో చదవాలి
పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. ముందుగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు.. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చాయి.. ఏ సబ్జెక్టులను ఎంత వరకు చదవడం పూర్తయిందని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలకు వెళ్లి వంటలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
ఉపాధిలో ప్రాధాన్య పనులకు అవకాశం
జనగామ రూరల్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి 100 రోజుల పని కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి పీడీ హౌజింగ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపిఓలతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షించారు. ప్రతి గ్రామానికి 75 మందికి తగ్గకుండా కూలీలతో పని చేయించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ వసంత, అదనపు డీఆర్‌డీఏలు నూరుద్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


