24వరకు పనులు పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులన్నీ ఈ నెల 24వ తేదీ కల్లా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణం, రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంగా దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతీ భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.
గద్దెల పునర్నిర్మాణ పనులు పరిశీలన
మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పగలు, రాత్రి విరామం లేకుండా పనులు చేయాలని ఎస్పీ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులకు విద్యుత్ సౌకర్యం కల్పించి రాత్రి సమయంలో సైతం పనులు చేసే వీలు కల్పించాలన్నారు.


