అప్పులే మిగిలాయి
● రాజకీయం వెనక దాగిన
కన్నీటి గాథలు
● గెలిచేందుకు చేసిన ప్రయాణంలో
గాయాలే ఎక్కువ
● ఎన్నికల హడావిడి తర్వాత కుటుంబం కోసం ఆరాటం
● సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. మధ్యతరగతి అభ్యర్థుల ఆవేదన
జనగామ: సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు లక్షలు, కొన్నిచోట్ల కోట్లు ఖర్చు చేసి చివరకు ఓటమి పాలై దారుణ పరిస్థితికి చేరుకున్నారు. ఎన్నికల ముందు పార్టీ కేడర్ నుంచి వచ్చిన హామీలు, గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, ‘అన్నా మేమున్నాం..’ అంటూ చెప్పిన మాటలు ఫలితాలు వచ్చాక ఒక్కొక్కటిగా క నుమరుగైపోయాయి. పది రోజుల పాటు ఊరంతా గోలగా ప్రచారంలో మునిగిపోయిన అభ్యర్థులు, ఓటమి తర్వాత కొన్ని చోట్ల కనీసం ఓదార్పు మాట కూడా దక్కక నిశ్శబ్దంలోకి జారిపోయారు.
పిల్లల భవిష్యత్తు ఎలా...?
ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో అప్పులు తెచ్చుకున్నారు. భూములు అమ్మేసుకున్నారు. ఫలితాల్లో ఓటమి తప్పలేదు.. పండగలా గడిచిన ఆ పదిరోజులు.. ఇప్పుడు చీకట్లు కనిపించేలా చేశాయి. ఇల్లు గడవడమే భారంగా మారింది. పిల్లల భవిష్యత్తు ఏంటోనని ఆలోచించుకునే సమయం కూడా లేకుండా డబ్బు ఇచ్చిన వాళ్లు అసలు మొత్తం, వడ్డీ తమ చేతిలోకి రావాలనే ఒత్తిడి పెంచుతున్నారు. కొత్తగా అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చేతిలో ఉన్న డబ్బంతా ప్రచారంలో పోయిన తర్వాత కుటుంబ జీవనం నెట్టుకొచ్చే మార్గాలపై అభ్యర్థులు తడుముకుంటున్నారు.
చేసింది తప్పేనా..!
గ్రామం కోసం పోటీచేశాం..ప్రజలు అడిగారు కాబట్టి ముందుకొచ్చాం..గెలిస్తే సేవ చేస్తాం అనుకున్నాం. కానీ చివరకు మిగిలింది అప్పుల భారం మాత్రమే. ఇప్పుడు మళ్లీ ఉద్యోగం కోసం తిరగాలా, వ్యవసాయాన్ని నమ్ముకోవాలా, లేక వలస వెళ్లాలా అనే సందిగ్ధంలో ఓ అభ్యర్థి తన మనసులోని మనోవేదనను వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఆదరిస్తూ నిలబడి ప్రోత్సహించినవారు, ఫలితాల తర్వాత ‘తప్పు మనలోనే ఉండవచ్చు..’అని అంటున్నారని వాపోతున్నారు. అయితే పరిచయం ఉన్నవాళ్లకు డబ్బు అందకపోవడంతోనే ఓటమి వచ్చిందని తననే నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఎన్నో సంవత్సరాల శ్రమతో పైసాపైసా పోగుచేసుకుని కూడబెట్టుకున్న సొమ్మంతా ఎలక్షన్లలో నీళ్లలా ఖర్చైపోయిందని బాధపడుతున్నారు. రిజర్వేషన్ కలిసి రావడం, పార్టీ, స్వతంత్రంగా నాయకత్వం ప్రోత్సాహం ఇవ్వడంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కానీ గెలుపు వాటికి దూరమైపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని ఆందోళన, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కలగలిపి మధ్యతరగతి అభ్యర్థుల జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఎన్నికల సందడి పోయిం ది.. మిగిలింది మాత్రం తీరని అప్పుల కుప్ప పేరుకపోయింది. కుటుంబ భవిష్యత్తుపై నీలి మబ్బులు కమ్ముకుంటూ అనిశ్చితి మాత్రమే మిగిల్చింది.


