మాస్టర్ ప్లాన్ కోసం ఫీల్డ్ సర్వే
జనగామ: అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా జనగామ మునిసిపాలిటీలో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ ఆర్‌ఎస్‌ఐ సాఫ్ట్‌టెక్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఫీల్డ్ సర్వే చేపట్టారు. మొదటి రోజు పట్టణంలోని 30 వార్డుల్లో సరిహద్దులను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలతో రికార్డు చేశారు. గృహాలు, భవనాలు, మౌలిక వసతి సౌకర్యాల కోసం కచ్చితమైన రికార్డులు, అమృత్ డిజైన్ ప్రమాణాల ప్రకారం డేటాను సేకరిస్తున్నారు.
కౌంటింగ్ అవకతవకలపై విచారణ చేయాలని నిరసన
కొడకండ్ల: మండలంలోని నీలిబండతండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వాంకుడోత్ సురేశ్, గిరిజనులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం 45 ఓట్ల మెజార్టీతో తాను గెలుపొందినట్లు ప్రకటించిన ఆర్‌ఓ తర్వాత రీకౌంటింగ్‌లో 5 ఓట్లతో రాకేశ్ గెల్చినట్లు ప్రకటించారన్నారు. కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తండా గిరిజనులతో ఆందోళన చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
శిశుమరణాలు తగ్గించేందుకు కృషిచేయాలి
జనగామ: జిల్లాలో శిశు మరణాలను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శిశు మరణాల సమీక్ష జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించి, సమయానికి రెఫర్ చేయడంతో పాటు అత్యవసరంగా నాణ్యమైన చికిత్స అందిచాలన్నారు. సమీక్షలో ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్, టీవీవీపీ విభాగం డాక్టర్ నరేందర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, శ్యామ్‌కుమార్ ఉన్నారు.
24న అర్చక ఉద్యోగ జేఏసీ సమావేశం
చిల్పూరు: ఈనెల 24న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే అర్చక ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని జేఏసీ నాయకుడు గంగు ఉపేందర్‌శర్మ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో శుక్రవారం అర్చచ, ఉద్యోగుల సమావేశం బ్రహ్మణపెల్లి రవీందర్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అర్చక, ఉద్యోగులకు 25 శాతం న్యాయం జరుగగా ఇంకా 75 శాతం సమస్యల్లోనే ఉన్నారన్నారు. ప్రభుత్వానికి సమస్యలను తెలియజేయడానికే 24న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అనుగుల రత్నాకర్‌శర్మ, డీవీఆర్‌శర్మ, కృష్ణమాచార్యులు, నిఖిలేష్, రంగాచార్యులు, మోహన్, వీరన్న, మల్లికార్జున్, శేఖర్, మహేశ్ పాల్గొన్నారు.
28, 29 తేదీల్లో యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు
జనగామ రూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ సమస్యపై కేంద్రం ఉదాసీనత సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 28,29వ తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో (మాంగళ్య ఫంక్షన్ హాల్)లో రాష్ట్ర విద్యా సదస్సు–రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. ప్రారంభసభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ పాల్గొంటారన్నారు.


