యూరియా..ఇక సులువయా!
● నేటినుంచి ‘ఫర్టిలైజర్ యాప్’
అందుబాటులోకి
పాలకుర్తి టౌన్: గత సీజన్‌లో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారు. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఇక నుంచి రైతులకు ఇలాంటి బాధలు లేకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ ‘ఫర్టిలైజర్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా ఎక్కడి నుంచైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఈనెల 20న దీన్ని ప్రారంభించనున్నారు.
ఎలా నమోదు చేసుకోవాలంటే...
యాప్‌ను ఓపెన్ చేసి పట్టాదారు పాసుబుక్ నంబర్, భూమి లేని కౌలురైతులైతే ఆధార్ నంబర్ సాయంతో లాగిన్ కావాలి. అందులో నమోదు చేసే సెల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాని సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పంటల వివరాలు నమోదు చేయాలి. సాగుభూమిని బట్టి ఎన్ని బస్తాల యూరియా రైతుకు ఇవ్వాలో యాప్ సూచిస్తుంది.
సమస్య ఇదే ..
రైతుల్లో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. మరి వీరికి ఎలా యూరియా సరఫరా చేస్తుందన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.
ఎక్కడి వారు అక్కడే..
సాగుభూమి ఉన్న జిల్లా నుంచే బుకింగ్ చేసుకోవాలి. ఒకసారి తీసుకున్నాక మళ్లీ 15 రోజుల వరకు అవకాశం ఉండదు. సమీపంలో ఉండే డీలర్ల పేర్లు కనిపిస్తాయి. అందులో ఒకరిని ఎంపిక చేసుకుటే 48 గంటల్లోపు బస్తాలు తీసుకోవచ్చు. ఈ సమయం దాటితే మాత్రం రైతు పేరు తొలగిపోతుంది. మరోసారి బుకింగ్ చేసుకోవాల్సిందే. కౌలు రైతులు బుక్ చేసుకుంటే ఓటీపీ సదరు భూమి యజమాని సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
ఎన్నిసార్లు బుక్ చేసుకోవచ్చు
(15 రోజుల విరామంతో)
0–1 ఎకరం: ఒకసారి
1–5 ఎకరాలు: రెండు సార్లు
5–20 ఎకరాలు : మూడు సార్లు
20 ఎకరాలపైన: నాలుగు సార్లు
ఎంత మేర.. (ఎకరా వారీగా)
వరి : 3 బస్తాలు
మొక్కజొన్న: 4
మిగతా వాటికి: 2
యూరియా..ఇక సులువయా!


