నవశకం
280 సర్పంచ్ స్థానాలకు 269 కొత్త ముఖాలు
పల్లెపాలనలో
జనగామ: గ్రామ పాలనలో కొత్త శకం ఆరంభమైంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 96 శాతం మందికి తొలిసారి సర్పంచ్‌గా అవకాశమొచ్చి, గ్రామ రాజకీయాలకు తాజా దిశను అందించనున్నారు. కొంగొత్త గ్రామ సచివాలయాల్లో అడుగుపెట్టి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు నడి పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ గ్రామ అభివృద్ధిలో నూతన సర్పంచ్‌ల పాత్ర కీలకంగా మారనుండగా, అనుభవం కన్నా ఆత్మవిశ్వాసానికి ప్రజలు మద్దతు తెలిపిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. జిల్లాలో గ్రామ రాజకీయాలు చారిత్రక మలుపు తిరిగాయి. స్టేషన్ ఘన్‌న్‌పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 280 సర్పంచ్ స్థానాలకు గాను 269 స్థానాల్లో కొత్త ముఖాలే గెలుపొందడం జిల్లా చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. కేవలం 11 మంది మాత్రమే గతంలో సర్పంచ్‌గా పని చేసిన వారు తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సర్పంచులు, ఇకపై ఐదేళ్ల పాటు గ్రామ పరిపాలన భవిష్యత్తును నిర్దేశించనున్నారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 96.07 శాతం స్థానాల్లో కొత్త నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టడం గ్రామాల్లో మార్పుపై ఉన్న ఆకాంక్షను స్ప ష్టంగా చూపిస్తోంది. వీరిలో కొందరు ఉన్నత విద్య ను అభ్యసించిన వారు కాగా, మరి కొందరు మధ్యస్థాయి విద్యతో గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెట్టా రు. ఇంకొందరికి పంచాయతీ పరిపాలనపై పూర్తి స్థాయి అనుభవం లేకపోయినా, ప్రజల నమ్మకమే తమ బలమని భావిస్తూ బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనుభవం లేకున్నా, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అధికార యంత్రాంగంతో సమన్వయం సాధించడం ద్వారా సమర్థవంతమైన పాలన అందించాల్సిన అవసరం ఉంది. రాబోయే ఐదేళ్లపాటు గ్రామాభివృద్ధి దిశగా వారి నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి.
గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు, అవసరమైన చోట ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అదనపు బడ్జెట్‌ను తీసుకురావడంలో చురుకుదనం చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిధులు గ్రామ ప్రజల కనీస అవసరాలను తీర్చేలా ఖర్చు చేయడమే కాకుండా, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు.
ఎన్నో ఆశలతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కొత్త సర్పంచుల ముందున్న అతిపెద్ద సవాల్. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పాలన అందించినప్పుడే ప్రజల మెప్పు పొందగలరు. ప్రతి రూపాయి గ్రామ అభివృద్ధికే ఖర్చు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లినప్పుడే నిజమైన ప్రజాప్రతినిధులుగా గుర్తింపు దక్కుతుంది.
జిల్లా గ్రామ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు గ్రామాభివృద్ధికి మేలు కలిగించేలా ఉండాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్పంచుల పాలన గ్రామాలకు సుభిక్షం తీసుకురావాలని, ప్రజలకు చేరువైన పాలనతో జిల్లాకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వానికి ఇది ఒక గొప్ప అవకాశం..అదే సమయంలో చరిత్రను మార్చే బాధ్యత కూడా ఎక్కువే అంటున్నారు.
నవశకం
నవశకం


