ఫలితం తారుమారు!
జనగామ: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం, చెల్లని ఓట్లు, నోటా వినియోగం కీలక చర్చనీయాంశంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి మూడు నియోజకవర్గాల్లో మొత్తం 3,90,945 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,44,040 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 46,905 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండి పోగా, నోటా, చెల్లని కేటగిరీలో 15,419 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లలో ఒకటి నోటాకు, ప్రతి వంద ఓట్లకు 3.6 శాతం మేర ఓట్లు చెల్లనివిగా ఉన్నాయి.
సర్పంచ్..వార్డులకు ఇలా..
జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు, 2,534వార్డుల పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ అభ్యర్థులకు వేసే ఓటులో నోటాకు 1,203, చెల్లని ఓట్లు 6,098 నమోదయ్యాయి. వార్డు సభ్యుల నోటాకు 1,681, చెల్లని ఓట్లు 6,437 నమోదయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు కలుపుకుని 15,419 ఓట్లు నోటా, చెల్లనివిగా ధ్రువీకరించగా, అభ్యర్థులకు ఉపయోగం లేకుండా పోయాయి. మొత్తం మీద పోలైన ఓట్లలో నోటాకు వచ్చిన ఓట్లు 2,884, చెల్లని ఓట్లు 12,535 ఉన్నట్లు తేల్చారు. ఈ లెక్కన ఓటర్ల ఆలోచనా తీరు, మరి కొందరిలో అవగాహన లేకపోవడం, ఆసక్తి తగ్గుదలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. బరిలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు నోటా, చెల్లని ఓట్లు నిర్ణయాత్మక దశలో భారీ నష్టాన్నే మిగిల్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఓటే విజయం లేదా ఓటమిని నిర్ణయించే సమయంలో వేలాది ఓట్లు నోటా, చెల్లనివిగా రావడం విజయాన్ని తలకిందులు చేశాయి. జిల్లాలో పోలింగ్ శాతం అత్యధికంగా 88శాతం ఉండటం మంచిదే అయినప్పటికీ, పోలింగ్‌కు దూరంగా ఉన్న ఓటర్లతో పాటు చెల్లని, నోటా వచ్చిన సంఖ్య వందలాది మంది అభ్యర్థుల ఆఽశలను ఆవిరి చేసింది. ఓటర్లలో ఓటు వేయడంపై అవగాహన ఉన్నా, సరైన గుర్తుపై ముద్ర వేయడంలో తడబాటు పడడంతో ఆ ఓటును పక్కనబెట్టారు. నోటా వినియోగం చాలా తక్కువే అయినా, ఇది ప్రజాభిప్రాయానికి సూచనగా భావిస్తున్నారు.
పొరపాటు ఎక్కడ జరిగింది...?
ఓటర్లు గుర్తుపై ముద్ర వేయడంలో పొరపాట్లు చేయడం, బ్యాలెట్ పత్రాలు అర్థం కాని పరిస్థితిలో వార్డు, సర్పంచ్ ఓటింగ్ విధానంపై స్పష్టత లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లనివిగా మిగిలిపోయాయి. ఇలా జరగని పక్షంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అభ్యర్థుల విజయం పూర్తిగా మారిపోయే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం, ఓటర్లు బ్యాలెట్ నియమాలు అర్థం చేసుకునేలా చర్యలు తీసుకోకపోవడం కూడా కా రణంగా పేర్కొంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఇంటింటా ప్రచారం చేసే సమయంలో ఓటింగ్ విధానం గురించి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ రెండు వైఫల్యాలే వేలాది ఓట్లను వృథా చేశాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదే కానీ ఈ ఎన్నికల్లో ఓటర్ల ఆసక్తి ఉన్నప్పటికీ అవగాహన లోపం కారణంగా అమూల్యమైన ఓట్లు లెక్కలోకి రాకుండా పోవడం ఓటమి చవిచూసిన అభ్యర్థులను నిరాశ మిగిల్చింది.
ప్రభావం చూపిన నోటా, చెల్లని ఓట్లు
స్వల్ప ఓట్లతో ఓడినవారికి నిరాశ
పోలింగ్‌కు దూరంగా 46వేల మంది


