నామినేషన్ కేంద్రాల పరిశీలన
పాలకుర్తి: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని వావిలాల, మల్లంపల్లి, దర్థేపల్లి, బమ్మెర, పాలకుర్తి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. మూడో విడతలో నిర్వహిస్తున్న ఎన్నికల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్‌ఐ దూలం పవన్‌కుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
నర్మెట: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, ఆర్డీఓ కె.గోపీరాం అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెస్సన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్ ముజ్తాబ, ఎంపీఓ వెంకటమల్లికార్జున్, డీటీ కురికాల వేణు, పీఆర్‌ఏఈ ప్రదీప్, కార్యదర్శి దామెర వంశీ ఉన్నారు.
అసంతృప్తులను అక్కునజేర్చుకుని..
దేవరుప్పుల: ఇతర పార్టీల్లోని అసంతృప్తులను బీజేపీ అక్కునజేర్చుకొని పలు గ్రామాల్లో బరిలో నిలుపుతోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా మండలాల్లో కేవలం మూడు, నాలుగు గ్రామాలకు పరిమితమైన బీజేపీ.. తమ పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ లేగ రాంమోహన్‌రెడ్డి తదితరుల నాయకుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో 72 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను బరిలో నిలువగా దేవరుప్పుల మండలంలో 12 సర్పంచ్ నామినేషన్‌లు వేయించడం గమనార్హం. దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గరాజు, సీతారాంపురం బీఆర్‌ఏస్ సీనియర్ నాయకుడు బస్వ రమేశ్‌లను బీజేపీలో చేర్చుకొని తమ ప్రాబల్యం కోసం వెంటనే సర్పంచ్‌గా నామినేషన్ వేయించారు.


