ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న | - | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న

Oct 18 2025 6:51 AM | Updated on Oct 18 2025 6:51 AM

ఛత్తీ

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావ

కీలక దాడులకు

వ్యూహకర్త ఆశన్న..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్‌జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ రూపేశ్‌ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110 మంది మహిళలు, 98మంది పురుషులు)సహచరులతో కలిసి 153 ఆయు ధాలతో ఆయన జగదల్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

చర్చల కోసం ప్రయత్నించి..

ఆపరేషన్‌ కగార్‌ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని కోరారు. అయినప్పటికీ పోలీస్‌ కూంబింగ్‌ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్‌ ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావన, పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర నాయకులు మల్లోజుల అలియాస్‌ అభయ్‌, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ రూపేశ్‌ సహచరులు, ఆయుధాలతో సరెండర్‌ అయ్యారు.

మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్‌ ఏరియా డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్‌ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్‌వార్‌ పార్టీ నాయకత్వం యాక్షన్‌ టీంకు ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్‌ని క్లైమోర్‌మెన్‌ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్‌ సంజీవరెడ్డినగర్‌లో ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్‌కు కూడా కొంతకాలం ఇన్‌చార్జ్‌గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్‌గఢ్‌, సౌత్‌బస్తర్‌, మాడ్‌ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.

తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్‌ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్‌) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్‌తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్‌ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్‌గ్యాబ్రియల్‌ స్కూల్‌లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు (ఆర్‌ఎస్‌యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్‌ఎస్‌యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు.

25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో..

దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావ1
1/1

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement