
కోర్టుల సముదాయ నిర్మాణానికి నేడు శంకుస్థాపన
జనగామ: జిల్లా న్యాయసేవలకు కొత్త దశ ప్రారంభం కానుంది. జనగామ మండలం చంపక్‌హిల్స్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో కోర్టుల సముదాయం నిర్మాణానికి ఈనెల 18న (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జనగామ పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, హైకోర్టు జడ్జిలు నామవరపు రాజేశ్వర్‌రావు, బీఆర్ మధుసూదన్‌రావు, సుద్దాల చలపతిరావు పాల్గొననున్నారు.
10 ఎకరాలు..రూ.81కోట్ల నిధులు
జనగామ కోర్టు నూతన భవన సముదాయ నిర్మాణం కోసం చంపక్‌హిల్స్‌లో 10 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.81కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు. ఇందులో 12 కోర్టుల సేవల కోసం డిజైన్ చేశారు. వీటిలో జిల్లా, పోక్సో, సీనియర్ సివిల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, అడిషినల్ జూనియర్ సివిల్ సెకెండ్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటు లోక్ అదాలత్, లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ సేవలు అందుతున్నాయి. ఇంకా ఫ్యామిలీ, ఎస్సీ,ఎస్టీ అదనపు సబ్, అడిషినల్ డిస్ట్రిక్, అదనంగా సబ్, మరో రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు రావా ల్సి ఉంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లాలోని వివిధ కోర్టులు ఒకేచోట ఉండేలా సదుపా యం కలగనుంది. ప్రస్తుతం సిద్దిపేట రోడ్డు గీతానగర్ ఏరియాలో కోర్టు సేవలు అందుతున్నాయి. రెండేళ్ల లోపు కోర్టు సేవలన్నీ ఒకే సముదాయంలోకి రానుండడంతో ప్రజలు, న్యాయవాదులకు, సిబ్బందికి సేవలు మరింత సౌలభ్యం కానున్నాయి. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ భవన సముదాయంలో న్యాయమూర్తుల చాంబర్లు, అడ్వకేట్ల హాల్, రికార్డు గదులు, లైబ్రరీ, మీటింగ్ హాల్, వెయిటింగ్ హాల్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పా టు చేయనున్నారు. జిల్లా ప్రజలు, న్యాయవాదులు ఈ ప్రాజెక్టుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు ఒకేచోట ఉండటం వల్ల కేసుల పరిష్కారంలో వేగం పెరుగుతుందని, న్యాయసేవలు మరింత చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు.
నేడు శంకుస్థాపన
చంపక్‌హిల్స్ ప్రధాన రోడ్డుకు సమీపంలో కోర్టు సముదాయాలకు కేటాయించిన స్థలంలో నూతన భవన నిర్మాణాల కోసం శనివారం హైకోర్టు జడ్జిల చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు పోక్సో, కుటుంబ కోర్టులతో సహా 12 కోర్టుల భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. డిస్ట్రిక్ సెషన్ జడ్జి బి.ప్రతిమ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన అనంతరం పసరమడ్ల శివారులోని ఉషోదయ ఫంక్షన్‌హాల్‌లో మీటింగ్ ఉంటుందన్నారు. కాగా, పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు చేపట్టనున్నారు.
చంపక్‌హిల్స్ 10 ఎకరాల స్థలం, రూ.81కోట్లు నిధుల కేటాయింపు
నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల రాక
కొత్త, అదనపు కోర్టులు వచ్చే అవకాశం