‘కొండా’ వివాదం సమసినట్లేనా..? | - | Sakshi
Sakshi News home page

‘కొండా’ వివాదం సమసినట్లేనా..?

Oct 17 2025 6:34 AM | Updated on Oct 17 2025 6:34 AM

‘కొండా’ వివాదం సమసినట్లేనా..?

‘కొండా’ వివాదం సమసినట్లేనా..?

కేబినెట్‌కు ఎందుకు వెళ్లలేదు.. అసలేం జరుగుతోంది..?

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ ఎక్కడ.. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టిలను కలిసిన సురేఖ.. కీలకమైన కేబినెట్‌ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్‌ను హీటెక్కించాయి.

సుమంత్‌ కోసం పోలీసులు..

కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..

మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళిలకు ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్‌ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్‌ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మితలు.. టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌కుమార్‌లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌కుమార్‌లతో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్‌ మీటింగ్‌కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్‌ మీటింగ్‌కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగుతుంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

హీటెక్కిన వరంగల్‌ రాజకీయాలు

మాజీ ఓఎస్డీ సుమంత్‌ కోసం ‘టాస్క్‌ఫోర్స్‌’..

కలకలం రేపిన కొండా సుస్మిత వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డితో విభేదాలు లేవన్న కొండా మురళి

కేబినెట్‌ మీటింగ్‌కు వెళ్లని

మంత్రి సురేఖ.. హాట్‌ టాపిక్‌గా తాజా పరిణామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement