
కొనుగోళ్లకు కొర్రీలు
జనగామ: మద్దతు ధరకు ఆశపడి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు వస్తున్న రైతులు ధాన్యం అమ్ముకోలేక చుక్కలు చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కన బెట్టి.. సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. సరుకులో తేమ వచ్చిన తర్వాత కొనుగోళ్లలో ఆలస్యం చేయొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కాంటా వేసిన సరుకు లిఫ్టు అయ్యే వరకు కొత్త కొనుగోళ్లు ఉండవు.. సారు వచ్చి టోకెన్ ఇచ్చే వరకు నిరీక్షణ తప్పదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారు. జనగామ మండలంలోని పలు గ్రామాల రైతుల సౌకర్యం కోసం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని కాటన్ యార్డులో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జనగామతో పాటు రఘునాథపల్లి, లింగాలఘణపురం సమీప మండలాల పరిధి నుంచి సైతం రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు ఇక్కడకు వస్తున్నారు. కాటన్ యార్డులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండడంతో ధాన్యం ఆరబోసుకునేందుకు వెసలుబాటు ఉండడంతో ఈ సెంటర్‌కు డిమాండ్ పెరిగింది. ధాన్యం ఆరబోసుకుంటూ.. 17 తేమ శాతం వచ్చిన తర్వాత మద్దతు ధరకు అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ... టోకెన్ నంబర్ ఇష్యూ, కాంటా వేయడంలో జాప్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించి, అమ్ముకునేందుకు వస్తే రైతులకు కనీస గౌరవం దక్కడం లేదు. సారూ తేమ శాతం వచ్చింది.. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ సెంటర్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో గౌరవ ప్రదంగా మాట్లాడుతుంటే... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు రైతులు.
తేమ వచ్చి వారం రోజులు
ధాన్యం తిర్లేసి.. మర్లేసీ ఒకటికి రెండు సార్లు ఆరబోసి ప్రభుత్వ నిబంధనల మేరకు 17శాతం వచ్చినా... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్‌లో కొనుగోలు చేయడం లేదు. తేమ వచ్చి వారం గడిచినా టోకెన్ కూడా ఇవ్వడం లేదు. కాంటా వేసిన బస్తాలు లిఫ్టు చేసిన తర్వాతనే గన్నీ బ్యాగులు ఇచ్చి కొనుగోళ్లు స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. కోపమొచ్చిన రైతులు నిలదీస్తే, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలుకు అర్హత సంపాదించినా... పదిరోజులుగా సెంటర్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. కేంద్రంలో రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడుతున్నారు. కాటన్ యార్డులో దూర భారముందంటూ బస్తాకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చినుకులు పడుతున్నా.. టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదంటున్నారు.
తేమశాతం వచ్చినా కొనుగోలు చేయరు
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
తాగునీరు ఉండదు.. టార్పాలిన్లు ఇవ్వరు
దూర భారమంటూ అదనపు వసూళ్లు
ఇబ్బందుల్లో అన్నదాతలు

కొనుగోళ్లకు కొర్రీలు