జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమన దిశలోకి మళ్లాయి. ఇక వర్షాలు కురిసే అవకాశాలు లేనట్లే. ఈసారి ఎల్‌నినో నేపథ్యంలో అసలు వర్షాలు కురుస్తాయా? లేదా? అనే మీ మాంసలో జిల్లాలో ఓ మోస్తారుగా వర్షాలు కురిశాయి. ఆ వర్షాలు సైతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెండు అల్పపీడన ప్రభావాలతో కురిసినవే. దీంతో జిల్లాలో దాదాపు 3.50 లక్షల ఎకరాల వరకు అన్ని రకాల పంటలు సాగు చేశారు. సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఎట్టకేలకు వానాకాలం పంటలు మాత్రం గట్టెక్కినట్లేనని రైతులు భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో భూగర్బజలాలు సైతం 3.50 మీటర్ల లోతుల్లోనే ఉండటం రైతులకు కొంత ఆశాజనకంగా మారింది.
జిల్లాలో 6 శాతం లోటు వర్షపాతం
జిల్లాలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవన కాలం. ఈ సీజన్‌లో జిల్లాలో 866.1 మి.మీ సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 815.2 మి.మీ వర్షపాతం మాత్రమే కురిసింది. దీంతో జిల్లాలో 6 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోల్చితే బీర్‌పూర్‌లో 1 శాతం, సారంగాపూర్‌లో 9 శాతం, కొడిమ్యాలలో 4 శాతం, మల్యాలలో 13 శాతం, వెల్గటూర్‌లో 34 శాతం, ఎండపల్లిలో 7 శాతం అధిక వర్షాపాతం నమోదైంది. అలాగే ఇబ్రహీంపట్నంలో 22 శాతం, మల్లాపూర్‌లో 10 శాతం, రాయికల్‌లో 7 శాతం, ధర్మపురిలో 5 శాతం, జగిత్యాల రూరల్‌లో 14 శాతం, జగిత్యాల అర్భన్‌లో 17 శాతం, మేడిపల్లిలో 12 శాతం, కోరుట్లలో 16 శాతం, మెట్‌పల్లిలో 16 శాతం, పెగడపల్లిలో 9 శాతం, గొల్లపల్లిలో 24 శాతం, భీమారంలో 22 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 16 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు, 3 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు, ఒక మండలంలో అధిక వర్షం కురిసినట్లు నివేదికలు ఉన్నాయి.
ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు అంతంతే..
ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు కురిసే అవకాశాలు అంతంతే. ఆక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం ఉండటం వల్ల వర్షాలు పెద్దగా కురిసే అవకాశాలు ఉండవు. ఏదైనా తుఫాన్ వస్తే తప్ప వర్షాలు ఆగిపోయినట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రుతుపవనాలు వెనక్కి మళ్లడంతో ఉష్ణోగ్రతలు 36–38 డిగ్రిల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అక్టోబర్ నెలలో ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


