అవగాహన సరే.. బుట్టలు ఏవి? | - | Sakshi
Sakshi News home page

అవగాహన సరే.. బుట్టలు ఏవి?

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

చెత్త సేకరణపై గ్రామస్తులకు అవగాహన తడి, పొడి, శానిటరీ, హానికర వ్యర్థాల వేర్వేరు సేకరణ పంపిణీ చేయని బుట్టలు

కథలాపూర్‌: నిత్యం గ్రామాల్లో టన్నుల్లో చెత్త ఉత్పత్తి అవుతుంది. దీనిని ఇష్టానుసారంగా పడేయడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలు కావాల్సి వస్తోంది. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం గ్రామాల్లో చెత్త సేకరణకు పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఇది పక్కాగా అమలు చేయాలంటే వ్యర్థాల నిర్వాహణకు అనుగుణంగా తడి, పొడి, శానిటరీ, హానికర చెత్తను వేర్వేరుగా సేకరించాల్సి ఉంటుంది. చెత్త సేకరించడానికి ఇంటింటా నాలుగు రకాల బుట్టలను అందిస్తేనే సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

● జిల్లాలో 385 గ్రామాలు

జిల్లాలో 20 మండలాలుండగా 385 గ్రామాలున్నాయి. 2.74 లక్షల ఇళ్లున్నాయి. ప్రతీ గ్రామంలో చెత్త సేకరణకు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ఉన్నాయి. ఇళ్లలోని చెత్తను వాడల్లోకి వచ్చే ట్రాక్టర్లలో పోస్తున్నారు.

● ఇష్టానుసారంగా సేకరించడంతో ఇబ్బందులు

2019లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్త సేకరణకు వీలుగా నీలం, ఆకుపచ్చ రంగు చెత్తబుట్టలను అందించారు. కొన్నిరోజుల తర్వాత చాలా గ్రామాల్లో అవి పాడైపోవడంతో ఇళ్లలోని చెత్తను సొంత డబ్బాలు, బ్యాగుల్లో నిల్వ ఉంచి ట్రాక్టర్లలో పడేస్తున్నారు. తడి పొడి చెత్తతోపాటు శానిటరీ, హానికరమైన వ్యర్థాలను కలిపేయడం వల్ల వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. పలువురు హానికరమైన, శానిటరీ చెత్తను కాల్చడం, ఇష్టమొచ్చిన చోట్ల వేయడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. దీంతో చెత్త సేకరణకు నాలుగు రకాలగా విభజించి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రజలకు నాలుగు రకాల బుట్టలు పంపిణీపై ప్రభుత్వం, అధికారులు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టిసారించి వేర్వేరుగా చెత్త సేకరణకు వీలుగా ఇంటింటా నాలుగు రకాలు చెత్తబుట్టలను పంపిణీ చేసి స్వచ్ఛతకు బాటలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

చెత్త బుట్టల వినియోగం ఇలా..

తడి చెత్త(ఆకుపచ్చ బుట్ట): ఆహార వ్యర్థాలు, కుళ్లిన కూరగాయాలు, పండ్ల తొక్కలు, పూలు, కాపీ, టీ పొడి

పొడి చెత్త(నీలం రంగు): ప్లాస్టిక్‌, కాగితం, ఆట్ట ముక్కలు, ఇనుము వస్తువులు.

శానిటరీ(ఎరుపు రంగు): శానిటరీ ప్యాడ్లు, డైపర్లు, న్యాప్కిన్లు, వైద్య చికిత్సలకు వాడిన వస్తువులు వీటిని ఓ పేపర్‌లో కప్పి బుట్టల్లో వేయాలి.

హానికరం(నలుపు రంగు): పాడైన విద్యుత్‌ పరికరాలు, మెడికల్‌ వ్యర్థాలు, రంగుల డబ్బాలు, బ్యాటరీలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement