జోరుగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

జోరుగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

జోరుగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు

నదికి ఎడమవైపు అదనంగా 8 ఎకరాల భూసేకరణ

రూ.40 కోట్ల వరకు వెచ్చించనున్న ప్రభుత్వం

తొలిదశ 3.7 కిమీల పనుల్లో 82 శాతం మేర పూర్తి

చెక్‌డ్యామ్‌కు బిగించేందుకు 14 గేట్లు తెచ్చిన నీటిపారుదల శాఖ

ఇప్పటివరకూ రూ.277 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం

మంత్రులు, కలెక్టర్‌ సమీక్షలతో పనుల్లో వేగం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

రీంనగర్‌ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మారుతుందని చెప్పుకుంటున్న మానేరు రివర్‌ఫ్రంట్‌ (ఎంఆర్‌ఎఫ్‌) కోసం మరింత భూమి అవసరమైంది. తాజాగా నదికి ఎడమవైపున 8.05 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నీటిపారుదల, పర్యాటక శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రూ.300 కోట్ల వరకు నీటిపారుదల శాఖ భరించగా, మిగిలిన నిధులను పర్యాటకశాఖ వెచ్చించనుంది. గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరం స్ఫూర్తిగా గత ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది. నదికి రెండు వైపులా కాంక్రీట్‌ గోడలు నిర్మించి తీరాన్ని రెండువైపులా పర్యాటపరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో చేపట్టిన మానేరు రివర్‌ఫ్రంట్‌ పురోగతి ప్రభుత్వం మారిన కొన్ని నెలల తర్వాత పర్యావరణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నెమ్మదించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రాధాన్యం ఇవ్వడంతో పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి.

రూ.40 కోట్ల చెల్లింపునకు సిద్ధం

ఎడమవైపు (నగరం వైపు) 8.05 ఎకరాల స్థలం అవసరం అయింది. నదీతీరం వైపు తవ్వేందుకు స్థలం కావాల్సి వచ్చింది. ఈ మేరకు తొలుత అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంత స్థలం కావాలి అన్న విషయంలో పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో తొలిదశలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అంతా సిద్ధమైనా.. ఆఖరు నిమిషంలో నోటిఫికేషన్‌ విడుదల కాకుండా నిలిచిపోయింది. చివరికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విషయాన్ని కొలిక్కి తీసుకురావడంతో 8.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అలా గే.. ఈ మొత్తం భూమికి యజమానులకు దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రులంతా పనులపై ఆరా తీస్తుండటంతో భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

తొలి దశలో 82శాతం పనులు పూర్తి..

మానేరు రివర్‌ ఫ్రంట్‌ మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు, రెండో దశలో 6.25 కిలో మీటర్ల మేర ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. మానేర్‌ రివర్‌ ఫ్రంట్‌లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది. స్పీడ్‌ బోట్లు, క్రూజ్‌ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఢిల్లీకి చెందిన ఐఎన్‌ఎస్‌ కన్సల్టెన్సీ మానేర్‌ రివర్‌ ఫ్రంట్‌ పనులు చేపడుతోంది. తొలిదశ పనుల్లో ఇప్పటి వరకు 82 శాతం పూర్తయ్యాయి. 3.75 కి.మీ ప్రొటెక్షన్‌ వాల్‌లో ఎడమవైపు 3.5 కి.మీ మేర, కుడివైపు 3.25 కి.మీ మేర గోడ నిర్మాణం అయిపోయింది. మరో 250 మీటర్ల మేర పనులు పెండింగ్‌ ఉన్నాయి. ప్రొటెక్షన్‌ వాల్స్‌కు ఇరువైపులా మట్టితో నిర్మించిన కట్ట పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా రూ.277 కోట్లను నీటిపారుదల శాఖ పనులకోసం వెచ్చించింది. ఇందులో భాగంగా తీగల వంతెన పక్కన నిర్మించనున్న చెక్‌ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటికి బిగించేందుకు అధికారులు గేట్లు కూడా తీసుకువచ్చారు. ఈ గేట్లతోనే మానేరు రివర్‌ఫ్రంట్‌లో నీటిని నియంత్రించనున్నారు. ఇటీవల కలెక్టర్‌ చిత్రా మిశ్రా సైతం మానేరు రివర్‌ ఫ్రంట్‌ విషయంలో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బ్యూటిఫికేషన్‌ వర్క్స్‌, రైలింగ్‌, గార్డెనింగ్‌ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్‌, టూరిజం కార్పొరేషన్‌, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement