కాగితాలకే పరిమితమైన అంగన్‌వాడీ పథకాలు
ప్రతి ముగ్గురిలో ఒకరు తక్కువ ఎత్తు, బరువు
రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అందని పౌష్టికాహారం
తల్లిదండ్రుల్లో అవగాహనారాహిత్యం
సిబ్బంది నిర్లక్ష్యం పిల్లలకు శాపం
గొల్లపల్లి: జిల్లాలో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రేపటితరం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా. క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, సిబ్బంది నిర్లక్ష్యం, తల్లిదండ్రుల అవగాహనరాహిత్యం కలిసి చిన్నారులను పోషకాహారలోపం వైపు నెడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఎదుగుదల లోపంతో.. తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో నీరసించిపోతున్నారనే నిజం జిల్లావాసులను కలవరపెడుతోంది. మహిళా, శిశు సంక్షేమశాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎదుగుదల లోపం
జిల్లాలోని 2,328 మంది చిన్నారుల్లో ఎదుగుదల లోపం కనిపించింది. వీరిలో 2,075 మంది మధ్యస్థ, 253 మంది తీవ్ర లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే భవిష్యత్తులో శారీరక సామర్థ్యం, మెదడు వికాసం, చదువులో ప్రతిభ దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తక్కువ బరువు
ఎత్తుకు తగిన బరువు లేని చిన్నారులు 2,829 మంది ఉన్నారు. వీరిలో 2,075 మంది మధ్యస్థంగా, 754 మంది తీవ్ర తక్కువ బరువుతో ఉన్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారు.
పోషకాహార లోపం
మొత్తం 2,343 మంది పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో 2,076 మంది మధ్యస్థ, 253 మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పట్టణాల్లో కన్నా.. మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలరూరల్ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన లేకపోవడం, సమతుల్య ఆహారం అందకపోవడం, అంటువ్యాధులు వ్యాపించడం దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచే పోషకాహారం అందించడం ద్వారా సమస్యను కాస్త అదుపులో ఉంచే అవకాశముందంటున్న వైద్యులు. అప్పుడే పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరు నెలల తర్వాత నాణ్యమైన అనుబంధ ఆహారం ఇస్తూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
జిల్లా వివరాలు
అంగన్‌వాడీ కేంద్రాలు 1,065
ఐదేళ్లలోపు చిన్నారులు 60,958
పరీక్షించిన చిన్నారులు 60,680
ఎత్తుకు తగిన బరువు లేనివారు 2,328
వయసుకు తగ్గ ఎత్తు లేనివారు 2,285
పోషకాహార లోపం ఉన్నవారు 2,343


