తుపాకుల కలకలం | - | Sakshi
Sakshi News home page

తుపాకుల కలకలం

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

● వరుస సంఘటనలతో భయంభయం ● జిల్లాలో పెరుగుతున్న గన్‌ కల్చర్‌ ● మెట్‌పల్లికి చెందిన గోనెల శంకర్‌కు అన్నతో భూ వివాదం ఉండటంతో వదినను చంపాలని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి రూ.35 వేలు చెల్లించాడు. అతడు అపరిచితుల నుంచి పిస్టల్‌, మూడు బులెట్లు వెంట తెచ్చుకున్నాడు. జూన్‌ 13న నిద్రిస్తున్న లక్ష్మీపై సచిన్‌వర్మ కాల్పులు జరిపి పారిపోయాడు. గురి తప్పడంతో బులెట్‌ ఎడమచేయి భాగంలో తగిలింది. వైద్యుల సర్జరీలో అది బులెట్‌ అని తేలడంతో ఈనెల 24న నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ● 2023 మే 31న కోరుట్ల మండలం అయిలాపూర్‌ శివారులో రైల్వేట్రాక్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అయిలాపూర్‌ గ్రామానికి చెందిన సందరగిరి లక్ష్మీనర్సయ్య వద్ద పిస్టల్‌ (ఆటోపిస్టల్‌ మేడ్‌ ఇన్‌ యూఎస్‌ఏ) లభించింది. పిస్టల్‌తోపాటు, రెండు మ్యాగ్జిన్‌లు, మూడు కేఎఫ్‌ 7.65 ఎంఎం బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. ● 2020 ఫిబ్రవరి 3న గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో సొంత భార్యను తుపాకీతో కాల్చి చంపాలని మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట శ్రీనివాస్‌ పథకం వేసి ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. ఆయన భార్య మేనమామ బైరం రాజిరెడ్డి గాయపడ్డాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం చోటుచేసుకుంది. ● 2018 అక్టోబర్‌ 18న ముంబయ్‌కి చెందిన రాజుభయ్యా రెండు తుపాకులు, 12 బుల్లెట్లను కోరుట్ల పట్టణంలో వేములవాడకు చెందిన తిరుపతికి విక్రయిస్తుండగా జగిత్యాల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

జగిత్యాలక్రైం: ఇలాంటి ఘటనల్లో తుపాకులే ప్రాధాన్యంగా కనిపిస్తుండడం సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌, బడా వ్యాపారులతోపాటు కొందరు భూ వివాదాల్లో గన్‌కల్చర్‌ ప్రదర్శిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో సంవత్సరానికో తుపాకుల కాల్పుల ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

తొమ్మిదేళ్లలో ఏడు సంఘటనలు

2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఏడు తుపాకుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నక్సల్స్‌ ప్రాబల్యం పూర్తిగా తగ్గిన అనంతరం తుపాకులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలామంది బడా వ్యాపారులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, రౌడీషీటర్లు మారణాయుధాలు వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

మారణాయుధాలు ఉంటే చర్యలు

ప్రజలు ఎవరు కూడా మారణాయుధాలు కలిగి ఉండరాదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అనుమానితులు కన్పించినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసు శాఖ ప్రజల భద్రతకు నిరంతరం పనిచేస్తుంది.

– అశోక్‌కుమార్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement