పనులు ప్రారంభం
జగిత్యాల: మున్సిపాలిటీల్లో చెరువులు ఎక్కువగా కలుషితం అవడంతోపాటు.. పిచ్చిమొక్కలతో కళాహీనంగా మారాయి. వీటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. లక్షకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీలకు రెండు చెరువులకు మంజూరు చేయగా.. మిగతా చోట్ల ఒక్కో చెరువుకు నిధులు మంజూరయ్యాయి. జగిత్యాలలోని రెండు చెరువులు, రాయికల్‌లో ఒకటి, ధర్మపురిలో ఒకటి, కోరుట్లలో ఒకటి, మెట్‌పల్లిలో ఒక చెరువుకు కలిపి రూ.18.84 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అమృత్ 2.0 పథకం కింద గత నాలుగు నెలల క్రితమే నిధులు మంజూరైనప్పటికీ 45 చెరువులకు ఒకేసారి టెండర్ నిర్వహించడం, ఎవరూ ముందుకు రాకపోవడంతో జాప్యం జరిగింది. ఈసారి పలు ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ పూర్తి కావడం, పనులు సైతం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
18 నెలల్లో పూర్తి
జిల్లా కేంద్రంలోని మోతె, చింతకుంట చెరువు, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి చెరువుల్లో పనులు ప్రారంభించారు. ఈ పనులన్నీ 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఈ చెరువులకు ప్రొటెక్షన్ చేయనున్నారు. చెరువులు కలుషితం కాకుండా డ్రైనేజీల నిర్మాణంతోపాటు, బండ్‌వాల్ ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేసుకుని మొత్తం చెరువులకు ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోనున్నారు. ఇటీవలే జిల్లా కేంద్రంలోని మోతె చెరువులో పనులు ప్రారంభించారు.
కలుషితంతో కళాహీనం
మున్సిపాలిటీల్లో చెరువులు పూర్తిగా కళాహీనంగా మారాయి. సివరేజీ ట్రీట్మెంట్‌ప్లాంట్ లేకపోవడం, డ్రైనేజీ నీరంతా ఈ చెరువులోకి వెళ్లి నీరంతా కలుషితం కావడంతో అటు మత్స్యకారులు, ఇటు తాగడానికి నీరు కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో చెరువులు పర్యటక కేంద్రాలుగా మారనున్నాయి.
చెరువు కబ్జా ఎక్కువగానే
వాస్తవానికి చెరువులు తాగునీటి అవసరాలు, భూగర్భజలాల పెంపునకు ఉపయోగపడాలి. కానీ మున్సిపాలిటీల్లో వెలువడే వ్యర్థపు నీరంతా ఈ చెరువులోకి వెళ్లడం, కొందరు ఆ చెరువుల్లోనే చికెన్ వ్యర్థాలు, చెత్తాచెదారం పడేయడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. భూములకు రెక్కలు రావడంతో చెరువుల్లోని పిచ్చిమొక్కలను తొలగిస్తూ, చదును చేస్తూ కబ్జాకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడం, టెండర్లు సైతం పూర్తి కావడం, ముందుగా చెరువుకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి అనంతరం సుందరీకరణ చేపట్టనున్నారు. 18 నెలల్లో చెరువుల రూపురేఖలే మారనున్నాయి.
అమృత్–2 పథకం కింద చెరువుల పునర్జీవానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో జగిత్యాలలో 2 చెరువులకు నిధులు మంజూరు కాగా.. మిగతా మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి మంజూరయ్యాయి. చెరువులు సుందరంగా మారుతాయి. 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా చెరువుల ప్రొటెక్షన్ చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తాం.
– వరుణ్,
పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీరింగ్ డీఈ


