కోరుట్ల: ఆరు గుంటల స్థలం.. మూడు చోట్ల పనికి రాని టైర్లు.. వాటి మధ్య వంకర టింకరగా మట్టి గుంతల రోడ్డు. ఇదే కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్.. ఇంత చిన్న స్థలంలో ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్టా..? అని ఎవరైనా నోరెళ్లబెడితే చేసేదేం లేదు. ఇదే ట్రాక్‌లో నడిపితే నడపండి.. నడపకున్నా సరే.. కాసులు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు కొంతమంది దళారులు రెడీగా ఉంటారు.
15 ఏళ్ల క్రితం..
పట్టణంలోని ఆదర్శనగర్‌లో సుమారు 15 ఏళ్ల క్రితం రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాతల దయతో సమకూరిన ఆ భవనం ముందున్న ఆరు గుంటల స్థలంలోనే వాహనాలను నిలిపి ఫిట్‌నెస్, టూ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డ్రైవింగ్ ట్రాక్ కనీసం ఎకరం స్థలంలో ఉండాలి. రివర్స్ గేర్ పరిశీలన కోసం ‘హెచ్’ ట్రాక్, ఎయిట్ ట్రాక్ వంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. యూటర్న్ వంటి ప్రత్యేకమైన ట్రాక్ ఉండాలి. ఇలా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా కేవలం ఐదారు గుంటల స్థలంలో మూడు చోట్ల మూడు టైర్లు వేసి వాటి మధ్యలో నుంచి వాహనాలు నడపించి ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్ట్ ఎలా పాస్ చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. 15 ఏళ్లుగా ఎలాంటి డ్రైవింగ్ ట్రాక్ లేకుండా ఇష్టారీతిన లైసెన్స్‌లు మంజూరు చేస్తున్న వైనం విడ్డూరం. ఈ లెక్కన ఇక్కడ అధికారులు ఫోర్ వీలర్, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చే సమయంలో ఎలాంటి ప్రమాణాలు పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇలా అడ్డగోలుగా లైసెన్స్‌లు పొందిన వారు రోడ్లపైకి వాహనాలను తెచ్చి ఎన్ని ప్రమాదాలకు కారకులవుతున్నారో తెలియని దుస్థితి.
చూసీ చూడనట్లుగానే..
కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్ దుస్థితి ఇలా ఉంటే.. అధికార యంత్రాంగం టెస్ట్ డ్రైవింగ్ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయం ముందు ఉండి లేనట్లుగా ఉన్న డ్రైవింగ్ ట్రాక్‌పై వాహనాలు నడిపే సమయంలో ఓ కానిస్టేబుల్ మాత్రమే పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. సదరు కానిస్టేబుల్ పక్కన ఆర్టీఏ ఏజంట్లు ఉండి.. ‘మనోడే..’ అని సిగ్నల్ ఇస్తే చాలు డ్రైవింగ్ ట్రాక్ టెస్ట్ పాసయినట్లేనని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సదరు దరఖాస్తులపై ఆర్టీఏ ఏజంట్లు వేసే ప్రత్యేకమైన చిహ్నాల ఆధారంగా దరఖాస్తుదారులు వాహనాలను నిబంధనల ప్రకారం నడిపినా.. నడపకున్నా పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఏ ఏజెంట్లు గట్టిగా అనుకుంటే దరఖాస్తుదారు డ్రైవింగ్ టెస్టులకు రాకున్నా లైసెన్స్ పొందే ‘ప్రత్యేక సదుపాయం’ ఇక్కడ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదేమైనా కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో నిబంధనల ప్రకారం పక్కాగా డ్రైవింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి లైసెన్స్‌ల జారీలో జాగ్రత్త వహించాల్సిన అవసరముంది.


