‘జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి తల్లిదండ్రులు ఏడాది క్రితం సెల్‌ఫోన్ కొనిచ్చారు. ఆ బాలుడు ఓ యాప్ ద్వారా రూ.6 వేల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో బాలుడికి నిత్యం ఫోన్ చేస్తూ యాప్ నిర్వాహకులు బూతులు తిట్టారు. మరుసటి రోజు బాలుడి తండ్రికి కూడా ఫోన్‌చేసి నానా బూతులు తిట్టడంతో రుణం పూర్తిగా చెల్లించారు.’
రాయికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా లోన్ యాప్ ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నాడు. వాటిని చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు వాట్సప్‌లో నానా బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టారు. అతడి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి బెదిరించడంతో అప్పు తెచ్చి లోన్ చెల్లించారు. రెండుమూడు రోజుల తర్వాత యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి మరో రూ.8 వేలు బాకీ ఉన్నాడని బెదిరించడంతో ఆ మొత్తాన్ని కూడా చెల్లించారు.
జగిత్యాలక్రైం: మైనర్లు, యువత వివిధ శ్రీయాప్‌శ్రీలలో రుణం తీసుకుని వాటిని చెల్లించలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా పాన్‌కార్డు, ఆధార్‌కార్డు నంబర్ ఇస్తే యాప్ నిర్వాహకులు ఫోన్‌పేకు రూ.5వేల నుంచి రూ.5 లక్షల వరకు అప్పు ఇస్తున్నారు. తీసుకున్న రుణాన్ని మైనర్లు, యువత ఖర్చు చేసి.. తిరిగి చెల్లించేందుకు డబ్బు లేక నానా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు యాప్ రుణదారులు సదరు వ్యక్తులకు ఫోన్ చేసి దుర్భషలాడుతున్నారు. రుణాలు తీసుకునేటప్పుడు వారి సెల్‌నంబరుతో పాటు సమీప బంధువుల సెల్‌నంబరు కూడా యాప్ రుణదారులు సేకరిస్తున్నారు. రుణం చెల్లించని సమయంలో సమీప వ్యక్తికి ఫోన్ చేసి దుర్భషలాడుతున్నారు. ఆ నోటా ఈనోటా కుటుంబసభ్యులకు తెలిసి.. పిల్లల బతుకులు ఆగమవుతున్నాయని ఆందోళనచెందుతున్నారు.
అప్పు చెల్లించుకుంటే తీవ్ర వేధింపులు
యాప్ ద్వారా రుణం తీసుకున్న వారు సకాలంలో రుణాలు చెల్లించకపోతే అప్పు చెల్లించడం లేదంటూ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సమీప బంధువులకు కూడా మెసేజ్‌లు చేస్తూ తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.


