జగిత్యాలటౌన్/జగిత్యాలక్రైం: కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలంటూ ఈనెల 18న జిల్లాకేంద్రంలో ఎంపీ అర్వింద్ నిర్వహించతలపెట్టిన ధర్మదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శనివారం తహసీల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. విద్యార్థుల కోసం దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ నిల్చిపోవడంతో పోలీసులు వచ్చి సముదాయించారు. ససేమిరా అనడంతో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురా లు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీస్‌స్టేషన్‌లో నిరసన
అరెస్ట్ చేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్టేషన్‌లోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కొంతమంది ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. శ్రావణి మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించే వరకూ ధర్మదీక్ష కొనసాగిస్తామన్నారు.
ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే..
జగిత్యాల: కేంద్రీయ విద్యాలయానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నిర్లక్ష్యంతోనే స్థలం కేటాయించడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. 9 నెలల క్రితం జిల్లాకు విద్యాలయం మంజూరు కాగా.. ఇప్పటివరకు స్థలం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. స్థలం ఇవ్వకపోగా.. స్కూల్ ఎవరికి పనికొస్తుందని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.


