పరాయి చేతుల్లో కిరాయి | - | Sakshi
Sakshi News home page

పరాయి చేతుల్లో కిరాయి

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

జగిత్యాల బల్దియాలో అద్దె దందా మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు కరువు ఏళ్లు గడుస్తున్నా బినామీలే అధికం టెండర్లు నిర్వహిస్తే బల్దియాకు ఆదాయం

పరిశీలిస్తున్నాం

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో బినామీల దందా నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు వేయగా, అప్పుడు దుకాణాలు దక్కించుకున్నవారే ఇంకా కొనసాగుతున్నారు. దాదాపు 17 ఏళ్ల క్రితం టెండర్లు నిర్వహించగా, పాతవారే బినామీలుగా ఉంటూ ఇతరులకు గుడ్‌విల్‌ కింద అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని బల్దియా అధికారులే పేర్కొంటున్నారు.

మున్సిపల్‌ కాంప్లెక్స్‌లకు డిమాండ్‌

జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించడంతో మార్కెట్‌ ధరలు, ప్రజల తాకిడి పెరిగింది. వాణిజ్య వ్యాపారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా షాపింగ్‌మాల్స్‌, దుకాణాలు వెలుస్తున్నాయి. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు డిమాండ్‌ పెరిగింది. ప్రైవేటు కాంప్లెక్స్‌లకు అద్దె అత్యధికంగా ఉండగా, మున్సిపల్‌ కాంప్లెక్స్‌ల గతంలో నిర్ణయించిన అద్దె కొనసాగుతోంది. ఈ అవకాశాన్ని బల్దియా అధికారులు, పాలకవర్గం సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మూడేళ్లకోసారి దుకాణాల టెండర్లు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం అద్దెలు 33.33 శాతం పెంచుతూ ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తున్నారు. కాగా, కొత్తగా టెండర్లు వేస్తే బల్దియాకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ కాంప్లెక్స్‌లకు, మున్సిపల్‌ కాంప్లెక్స్‌లకు అద్దె విషయంలో చాలా వ్యత్యాసం ఉంది.

అందులో బినామీలే..

జగిత్యాల డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు పలువురు టెండర్ల ద్వారా మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ల సముదాయం పొంది వాటిని అద్దెకిస్తున్నారు. అప్పుడు టెండర్‌ పొందిన యజమానులు ఏటా 33.33 శాతం మున్సిపల్‌కు అద్దె చెల్లిస్తూ వారే కొనసాగుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఎవరైతే టెండర్‌ పొందారో వారే షాపులు నిర్వహించుకోవాలి. కానీ, వీరు ఇతరులకు అద్దెకిస్తూ ఎక్కువ మొత్తంలో కిరాయి పొందుతున్నారు. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్లు పొందిన అభ్యర్థే షాప్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఒకరిద్దరు మినహా ప్రతి షాపులో వేరేవారు కొనసాగుతున్నారు. కాగా, అద్దె దందాను మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

పెరిగిన ధరలు

జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక షాపునకు దాదాపు అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా, మున్సిపల్‌ షాపులకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు మాత్రమే ఉంటుంది. దీంతో గతంలో టెండర్లు పొందిన వారే ఎక్కువ అద్దెకిస్తూ లబ్ధిపొందుతున్నారు. దీంతో బల్దియా ఆదాయానికి గండిపడుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మున్సిపల్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు నిర్వహిస్తే బల్దియాకు అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

జగిత్యాల మున్సిపల్‌కు సంబంధించి షాపింగ్‌ కాంప్లెక్స్‌, అంగడిబజార్‌, పార్క్‌ సంది, ఎంపీడీవో ఆఫీస్‌ ఎదురుగా, పాతబస్టాండ్‌ సమీపంలో మొత్తం 198 దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఒకట్రెండు మినహా మొత్తం అద్దెకే నడుస్తున్నాయి. కాగా, దాదాపు 17 ఏళ్ల క్రితం నిర్వహించిన టెండర్ల ద్వారా అప్పుడే మున్సిపల్‌కు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కాంప్లెక్స్‌లకు మళ్లీ వేలం వేస్తే అత్యధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్‌ కాంప్లెక్స్‌లో నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల అద్దె ఉంటుంది. మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో మాత్రం అప్పటి అద్దెకు 33.33 శాతం పెంచుతూ పోతున్నారు. అంతేకానీ టెండర్లు మాత్రం నిర్వహించడం లేదు.

మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల గురించి పరిశీలిస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు టెండర్లు వేశారు, తదితర వివరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– సత్యప్రణవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

Advertisement
 
Advertisement
Advertisement