మెట్‌పల్లి తహసీల్‌లో ఫైళ్లు మాయం! | - | Sakshi
Sakshi News home page

మెట్‌పల్లి తహసీల్‌లో ఫైళ్లు మాయం!

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

ధ్రువీకరణ పత్రాల జారీలో అధికారుల నిర్లక్ష్యం ఇబ్బందిపడుతున్న దరఖాస్తుదారులు

మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వారిది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రధానంగా ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. సకాలంలో ఇవ్వకపోగా, దరఖాస్తు ఫైళ్లు కనిపించడం లేదంటూ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గడువును పట్టించుకోని వైనం

● ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటి జారీ విషయంలో అధికారులకు గడువును నిర్దేశించింది.

● మీ–సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత గడువులోపు పత్రాలను జారీ చేయాలి.

● కానీ, మెట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అలా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

● పైరవీకారులు, పలుకుబడి ఉన్నవారికి గడువు కన్నా ముందే, అవసరమైతే దరఖాస్తు చేసుకున్న కొన్ని గంటల్లోపే జారీ చేస్తుండగా, సాధారణ దరఖాస్తుదారుల్లో పలువురికి గడువు ముగిసినా ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్చనీయాంశమవుతున్న ఫైళ్ల మాయం

● ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి వచ్చే దరఖాస్తు ఫైళ్లను భద్రపర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న రెండు సంఘటనలు దీనికి అద్దం పడుతోంది.

● ఇవే కాకుండా గతంలో కూడా కొందరి ఫైళ్లు గల్లంతు కావడంతో నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు.

● దరఖాస్తుదారులు ఇచ్చే ఫైళ్లలో కొన్ని ఎందుకు కనిపించకుండాపోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం చూపుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వివరణకు స్పందించని ఆర్‌ఐ

ఫైళ్లు మాయమవుతున్న వ్యవహారంపై పట్టణ బాధ్యులు ఆర్‌ఐ కాంతయ్యను ఫోన్‌లో వివరణ కోరడానికి ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement