ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పూలతో చూడముచ్చటగా అలంకరించారు. అర్చకులు శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అన్ లోడింగ్‌లో జాప్యం చేయొద్దు
కథలాపూర్(వేములవాడ): వరిధాన్యం బస్తాల అన్‌లోడింగ్ విషయంలో రైస్‌మిల్లుల నిర్వాహకులు జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ బీఎస్ లత సూచించారు. శుక్రవారం మండలంలోని సిరికొండ గ్రామశివారులోని నాలుగు రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం బస్తాల వాహనాలు నిలిపి ఉండటంపై స్థానిక అధికారులతో చర్చించారు. కూలీల కొరత ఉందని రైస్‌మిల్ నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీల కొరత ఉంటే ట్రాక్టర్లలో తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ రమేశ్, డెప్యూటీ తహసీల్దార్ ఉమాపతి, ఆర్‌ఐ రవీందర్ పాల్గొన్నారు.
ధర్మపురి కో ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవం
ధర్మపురి: ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కో ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి అధ్యక్షతన కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్నిక జరిగింది. ఈసందర్భంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయ ఆవరణ కౌన్సిలర్లు, నాయకులతో కిక్కిరిసిపోయింది. స్పెషల్ నాలెడ్జ్ మహిళ కోటాలో అశెట్టి మమత శ్రీనివాస్, జనరల్ కోటాలో గరిగె అరుణ రమేశ్, మైనార్టీ కోటాలో మొహ్మద్ నఫీజ్ సుల్తానారఫియొద్ది న్, ముస్లిం జనరల్ కోటాలో షౌకత్ పాషా అలీమొద్దిన్‌ను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌కు రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులు
జగిత్యాలటౌన్: ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల నుంచి ఆదిలాబాద్‌కు రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన శుక్రవారం తెలిపారు. ఉదయం 8.20 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరే బస్సు సారంగాపూర్, జన్నారం మీదుగా 12.20 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు. ఆదిలాబాద్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు జగిత్యాలకు చేరుకుంటుందన్నారు. మరో ఎక్స్‌ప్రెస్ బస్ మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఆదిలాబాద్‌కు, అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు జగిత్యాల చేరుకుంటుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.


