ఆస్తి పన్ను కట్టకుంటే కరెంట్‌ కట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను కట్టకుంటే కరెంట్‌ కట్‌

Mar 29 2026 7:21 AM | Updated on Mar 29 2026 7:21 AM

● సర్కార్‌ స్కీంకు విరుద్దంగా వసూళ్లు ● కోరుట్ల బల్దియాలో వింత పోకడ

కోరుట్ల: కోరుట్లలో ఆస్తి పన్ను వసూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో అధికారులు ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటే పొరపాటు పడ్డట్టే.. ఇప్పటికే 90 శాతం ఆస్తి పన్ను వసూళ్లు పూర్తయి రాష్ట్రస్థాయిలోనే మూడో స్థానంలో ఉంది. అయినా ఇంత కఠినంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారంటే.. స్పెషల్‌ గ్రాంట్‌ కోసం అని అధికారులు చెబుతుండడం గమనార్హం.

ఏమిటీ గ్రాంట్‌..!?

మార్చి 31 వరకు 95 నుంచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేసిన మున్సిపాలిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పెషల్‌ గ్రాంట్‌ కింద రూ. 3 కోట్లు వచ్చే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలో కొన్నిచోట్ల మున్సిపాలిటీలకు చెందిన అధికార యంత్రాంగం ముందువెనకా చూడకుండా పన్నుల వసూళ్లకు పూనుకుంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో మొత్తం మున్సిపాలిటీల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట 91 శాతం, హుజూరాబాద్‌ 90.05 శాతంతో మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. కోరుట్ల 90 శాతంతో మూడో స్థానంలో ఉంది. అయినప్పటికి టార్గెట్‌ రీచ్‌ కావడానికి కొందరు మున్సిపల్‌ అధికారులు ఎక్కడలేని తాపత్రాయం చూపుతున్నారు. నల్లా కనెక్షన్లు తీసేయడం మున్సిపల్‌ అధికారుల పరిధిలోకి వచ్చేది కావడంతో ఎవరు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కొంతమంది అధికారులు మరి కాస్త ఉత్సుకత చూపి కరెంట్‌ మీటర్లు కట్‌ చేసే వరకు వెళ్లడం కలకలం రేపుతోంది.

సంక్షేమ స్ఫూర్తికి దెబ్బ..

కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వారందరికి జీ రో బిల్లు ఇచ్చి ఆదుకుంటోంది. కానీ.. ప్రభుత్వ సంక్షేమ స్ఫూర్తికి విరుద్ధంగా నిరుపేదల ఇంటి పన్నుల వసూళ్లకు మున్సిపల్‌ అధికారులు కరెంటు కనెక్షన్లు కట్‌ చేయడం విడ్డూరం. ఈ విషయం విద్యుత్‌ శాఖ అఽధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఏకంగా పోల్‌ పైకి ఎక్కి సర్వీస్‌ వైర్లను మున్సిపల్‌ సిబ్బంది కట్‌ చేయడం విచిత్రం. విద్యుత్‌ శాఖ అధికారులకు తెలపకుండా కరెంట్‌ సరాఫరా నిలపకుండా పోల్‌ ఎక్కితే విద్యుత్‌ షాక్‌ వంటి సమస్యలు వచ్చి పన్ను వసూలుకు వెళ్లిన ఉద్యోగులు చిక్కుల్లో పడితే బాధ్యులు ఎవరన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ను వివరణ కోరితే తాము కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆస్తి పన్ను చెల్లించని వారి ఇళ్లకు కరెంటు కట్‌ చేస్తున్నామని చెప్పడం విశేషం.

‘అయ్యా.. నా పేరు దండుగుల లత.. మేం పేదోల్లం. మాకు కోరుట్ల అయోధ్యనగర్‌లో ఇల్లు ఉంది. మా మామ కనకయ్య ఇంటిపై ఆస్తి పన్ను రూ.2,300 ఉంది. ఆ పన్ను కట్టాలని పొద్దున్నే నలుగురు మున్సిపాల్టీ వాళ్లు వచ్చారు. వద్దు సార్‌.. పన్ను కడతామని చెప్పినా వినకుండా మిషన్‌ భగీరథ కనుక్షన్‌ కట్‌ చేశారు. కరెంట్‌ కనెక్షన్‌ తీసేసి వెళ్లిపోయారు. అసలే ఎండాకాలం.. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పినా వినలేదు. ఆస్తి పన్ను కట్టండి.. కరెంట్‌ పెట్టిస్తాం’.. అని చెప్పి వెళ్లారు. అలా అదే ఏరియాలో మరో మూడు ఇళ్లకు కరెంట్‌ కట్‌ చేసి వెళ్లారు. ఇదీ..కోరుట్ల మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లకు అధికారులు చేపట్టిన వింత పోకడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement